Sunday, January 5, 2014

Security in Srikakulam temples,శ్రీకాకుళం ఆలయాల్లో భద్రత

  •  

  •  

భక్తులు సంచులతోనే గర్భగుడి ప్రవేశం--పట్టించుకోని భద్రతా సిబ్బంది.

    చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులు తలదాచుకుని తిరుమలపై దాడికి పన్నాగం పన్నారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భద్రతే కరవయ్యింది. భక్తులు ఎక్కువగా దర్శించుకునే అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాల్లో భద్రత తీసికట్టుగా ఉంది. రక్షణ గాలికొదిలి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలపై ఉగ్రవాదుల దాడులు పొంచి ఉన్నాయంటూ పదేపదే ఇంటిలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇటీవల పుత్తూరులో ఉగ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసిందే.. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఆలయాల రక్షణ చర్యల్ని గాలికొదిలేసింది. ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయకుండా రోజులు దొర్లించేస్తోంది. నామమాత్రపు సిబ్బందితో పని కానిచ్చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ అధికారుల్ని ఎప్పుడు ప్రశ్నించినా 'త్వరలోనే ఏర్పాటు చేస్తాం' అన్న సమాధానమే ఎదురవుతోంది.

ఆదిత్యుని ఆలయంలో భద్రత శూన్యం
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అరసవిల్లి పేరుగాంచింది. రాష్ట్రం నలుమూలల నుంచీ ఎంతో మంది ప్రముఖులు ఆదిత్యుని దర్శనార్థం వస్తారు. రథసప్తమి, హంసనావికోత్సవం, మాఘమాసం, వార్షిక కల్యాణం లాంటి ప్రత్యేక సందర్భాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ప్రతీ ఆదివారం సైతం ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆలయ గర్భగుడిలోకి భక్తులు నేరుగా సంచులతో వెళ్లిపోతున్నారు. ఇక్కడి భద్రతా చర్యలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి సంబంధించి ఏడుగురు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు హోంగార్డులు షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. కనీస తనిఖీలు కూడా జరగడం లేదు. కేవలం రెండు మెటల్‌ డిటెక్టర్లు ఉన్నాయి. అవీ పనిచేయడం లేదు. వాటితో పాటు నాలుగు హేండిల్‌ మెటల్‌ డిటెక్టర్లు అందుబాటులో ఉన్నా భద్రతా సిబ్బంది వాటిని వినియోగంలోకి తేవడం లేదు. వాటితో పాటు ఎనిమిది సీసీ కెమెరాలు ఉన్నా.. వాటి రికార్డింగ్‌ పుటేజీని పరిశీలించే పరిస్థితి ఆలయంలో లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆలయ సహాయ కమిషనర్‌ ఆర్‌. పుష్పనాదం అరసవిల్లి ఆలయానికి ఇన్‌ఛార్జి ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సరిగ్గా అందుబాటులో ఉండడంలేదు. దీంతో ఆదిత్యుని ఆలయ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.

శ్రీకూర్మం, శ్రీముఖలింగంల్లోనూ కనీస రక్షణ చర్యలు కరవు
కూర్మావతారంలో కొలువైఉన్న శ్రీకూర్మం ఆలయానికి జిల్లాలో విశేష స్థానం ఉంది. డోలోత్సవ సమయంలో అత్యధికంగా ప్రజలు స్వామిని దర్శించుకుంటారు. ఇంత పెద్ద ఆలయానికి.. ఉన్నది ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మాత్రమే.. ఆలయ దర్శనార్థం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చినపుడు మాత్రమే వారి వెంట భద్రతా సిబ్బంది వస్తున్నారు. అంతేతప్ప ప్రత్యేకించి భద్రతా సిబ్బంది ఇక్కడ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. శ్రీకూర్మంలో మెటల్‌ డిటెక్టర్లు లేవు. సీసీ కెమెరాలు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. జిల్లాలో పురాతన కాలం నుంచి ప్రసిద్ధి గాంచిన మరో ఆలయం శ్రీముఖలింగం. ఇక్కడికి కార్తీక మాసం, శివరాత్రి, ఏకాదశి రోజుల్లో.. ప్రతీ ఆదివారం భక్తులు ఎక్కువగా వస్తారు. అరసవిల్లి, శ్రీకూర్మం ఆలయాలకొచ్చే భక్తులు ఇక్కడకీ రావడం ఆనవాయితీగా వస్తోంది. భద్రతాపరంగా శ్రీకూర్మం పరిస్థితే ఇక్కడుంది. మెటల్‌ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు లేవు. ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు రాత్రి సమయంలో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

సీసీ కెమెరాలు ప్రతిపాదనలో ఉన్నాయి
శ్రీకూర్మం ఆలయానికి ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. ఆదివారం సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువ. ఆలయం పెద్దదే కాని ఆదాయం తక్కువ. దాంతో పటిష్ఠ రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం కష్టమవుతోంది. ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు ట్రైమెక్స్‌ కంపెనీ వాళ్లు ఓ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అయితే అవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి.
- శ్యామలాదేవి, శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వాహణ అధికారిణి
ఆదాయం లేకే
ఆలయంలో ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ఉన్నారు. అతను రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తారు. ఆలయానికి ఆదాయం సరిపోకే ఇంతకంటే భద్రత పెంచలేకపోతున్నాం. సంవత్సరానికి ఆలయానికి వచ్చే రూ. 11.50 లక్షల్లో 20 శాతం దేవాదాయ శాఖకి ఇచ్చేయాలి. మిగతా ఆదాయంతో అర్చకులు, సిబ్బంది జీతాలతో పాటు, విద్యుత్తుబిల్లు, ఉత్సవాల సమయంలో ఖర్చు పెట్టాలి. ఇంతకంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులు రావు.
- ప్రభాకరరావు, శ్రీముఖలింగం ఆలయ కార్యనిర్వాహణ అధికారి

courtesy with : ఈనాడు-శ్రీకాకుళం
  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !