నిర్లక్ష్యమే కారణము :
జిల్లావ్యాప్తంగా 5.35 లక్షల మంది రైతులుంటే గత రెండేళ్లలో కేవలం 34 మందే ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఆమదాలవలసలో 14 మందికి, నరసన్నపేటలో నలుగురికి, పాలకొండలో నలుగురికి, పొందూరులో ఒకరికి మాత్రమే రుణాలందాయి. 2012-13లో నరసన్నపేటలో ఏడుగురు, పాలకొండలో ముగ్గురు, ఆమదాలవలస మార్కెట్ కమిటీలో ఒకరికి రుణం మంజూరు చేశారు. పంటల్ని నిల్వ చేసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నా వాస్తవం విరుద్ధంగా ఉంది.
* పలాస మార్కెట్ కమిటీకి 2007-08 నుంచి రైతుబంధు పథకం ద్వారా రూ. 36 లక్షలు మంజూరయ్యాయి. ఒక్క రూపాయి కూడా రైతులకు ఉపయోగపడలేదు.
* పాతపట్నం మార్కెట్ కమిటీకి 2008-09 నుంచి ఇప్పటివరకూ రూ. 45.48 లక్షలొచ్చినా మురిగిపోయాయి.
* పొందూరు కమిటీకి గత మూడేళ్లుగా రూ. 30 లక్షలు మంజూరైనా ఒక్క రైతుకి రూ. 50 వేల రుణం ఇచ్చారు.
* రాజాం కమిటీలో 2007 తరువాత రైతులకు ఎలాంటి రుణాలు మంజూరుకాలేదు.
సమస్యలు :
* రైతులు పంటను దాచుకునేందుకు సమీపంలో గోదాములు లేవు. దాంతో ధాన్యాన్ని దగ్గర్లోని గోదాములకి తరలించడానికి బస్తాకి 50, 60 రూపాయల పైనే ఖర్చవుతోంది.
* నిల్వ చేసుకున్న పంటకి రుణాలిస్తారో లేదో, ఇచ్చినా ఎంతిస్తారోనన్న భయం అన్నదాతల్ని వెంటాడుతోంది.
* కొన్ని చోట్ల రైతులకు కాకుండా టోకు వ్యాపారులకే రుణ సదుపాయం కల్పిస్తున్నాయన్న విమర్శలున్నాయి.
* ధాన్యం ధరల్లో భారీ స్థాయిలో పెరుగుదల కనిపించకపోవడం, పంటకు ఆశించిన స్థాయిలోనైనా ధర పెరుగుతుందో లేదోనన్న అనుమానాలు వెంటాడడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు.
దగ్గర్లో గోదాముంటే నిల్వ చేసేవాళ్లం--- బెవర మల్లేశ్వరరావు, పాతపాడు, సరుబుజ్జిలి మండలం
మా కుటుంబమంతా కలిసి ఏడాదికి వెయ్యి బస్తాల వరకూ ధాన్యం పండిస్తాం. రైతు బంధు పథకాన్ని ఉపయోగించుకుని కొంతవరకూ పంటను నిల్వ చేసుకుందామంటే దగ్గర్లో గోదాములు లేవు. ఆమదాలవలస వరకూ బస్తాల్ని తీసుకెళితే రవాణాకే ఖర్చవుతోంది. అందుకే ఎప్పటికప్పుడు పంటను అమ్మేయక తప్పడం లేదు.
రైతులు ముందుకు రావడం లేదు--- వై.వి. శ్యాంకుమార్, మార్కెటింగ్ శాఖ ఏడీ
రైతు బంధు పథకం ద్వారా మార్కెట్ కమిటీలకు నిధులు కేటాయిస్తున్నా పంటను నిల్వ చేసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచడంతో అక్కడే అమ్మకానికి సిద్ధపడుతున్నారు. దగ్గర్లో గోదాములు లేకపోయినా సమీపంలోని నాబార్డ్ గోదాముల్లో నిల్వ చేసుకున్నా పథకాన్ని అమలుచేస్తాం.
courtesy with : Eenadu telu dialy news paper dt.29-12-2013,
- ===========================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !