పరమశివుని ఆలయం.. ప్రత్యేకతల నిలయం-ఒకే పానవట్టంపై... రెండు శివలింగాలు-రాష్ట్రంలో రెండోది-తంపటాపల్లి ఆలయ ప్రత్యేకత -- సాధారణంగా శివాలయాల్లో ఒకే శివలింగం ఉంటుంది. కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో మాత్రమే ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉన్నాయి. అటువంటి ఆలయాన్ని పాలకొండ మండలం తంపటాపల్లిలో ఇటీవల నిర్మించారు. పలు ఇతర ప్రత్యేకతలతో ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది.
తంపటాపల్లివాసులకు ఎప్పటి నుంచో శివాలయం నిర్మించాలనే కోరిక ఉండేది. గ్రామానికి చెందిన కొమ్మూరు నరేంద్రస్వామి కుటుంబ సభ్యులు కాళేశ్వరం దర్శించుకున్న సందర్భంగా అక్కడ ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడి లింగాలను గమనించి ఆకర్షితులయ్యారు. అటువంటి ఆలయం రాష్ట్రంలో మరెక్కడా లేకపోవడంతో దానిని నమూనాగా తీసుకుని గ్రామంలో నిర్మించాలని సంకల్పించారు. భక్తులు, గ్రామస్థుల సహకారంతో ఇటీవల ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఒకే పానవట్టంపై ఉమామహేశ్వరస్వామి, వీరభద్రస్వామి పేరిట శివలింగాలను ఏర్పాటు చేశారు. నిత్యపూజలతో ఆలయ కళకళలాడుతోంది. రెండు శివలింగాలకు రోజూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రెండు నందులు
ఆలయంలో శివలింగాలకు అభిముఖంగా నందీశ్వరుడితోపాటు భృంగీశ్వరుని పేరిట రెండు నందులను ఏర్పాటు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద మరో భారీ నందీశ్వరున్ని కొలువు దీర్చారు.
శివలింగాలపై సూర్యకిరణాలు
సూర్యకిరణాలు తాకేటట్లు శివలింగాలను ప్రతిష్ఠించడం ఇక్కడి పత్యేకత. ఉదయం ఏడు గంటల నుంచి కొద్ది నిమిషాలపాటు ఈ రెండు శివలింగాలపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.
ఆధ్యాత్మికతకు నిండుకుండ
తంపటాపల్లి శివాలయాన్ని సందర్శిస్తే మనస్సు ఆధ్యాత్మిక భావనతో నిండిపోతుంది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే సర్పాల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రధాన ద్వారం ఇరువైపులా సరస్వతి, లక్ష్మీదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి. శివాలయం పక్కనే నెమలి వాహనంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరి కనిపిస్తారు. ఆలయ వెనుక భాగాన నవగ్రహ మండపం ఉంది.
కార్తీక అఖండదీపం
శివుడు జ్యోతిస్వరూపుడు. ఈ కార్తీక మాసం నెలరోజులూ శివాలయంలో దీపాలకు ప్రత్యేకత ఉంది. రెండు శివలింగాలకు అభిముఖంగా అఖండజ్యోతిని భక్తులు ఏర్పాటు చేశారు. కార్తీకమాస ప్రారంభ రోజైన ఈ నెల 4న ఈ జ్యోతిని వెలిగించారు. కార్తీకమాసం 30 రోజూలూ వెలుగూతూనే ఉండేలా ఏర్పాట్లు చేశారు.
రూ. 15 లక్షలతో నిర్మాణం
ఆలయాన్ని గ్రామస్థులు, భక్తుల విరాళాలతో నిర్మించారు. గ్రామస్థుల శ్రమదానం కాకుండా, ఇప్పటి వరకు రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కేవలం ఆరునెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయింది.
ఇలా వెళ్లాలి
పాలకొండ-వీరఘట్టం ప్రధాన రహదారిలో తంపటాపల్లి కూడలి వస్తుంది. ఈ మార్గం ద్వారా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
ప్రత్యేకత కోసమే
గ్రామంలో శివాలయాన్ని నిర్మించేందుకు తొలుత నిర్ణయించాం. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే బాగుంటుందని భావించాం. శ్రీశైలం ప్రధాన అర్చకుడు గంగాధరస్వామి సూచనల మేరకు ఒకే పానవట్టంపై రెండు శివలింగాలను ప్రతిష్ఠించాం. గ్రామస్థులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భక్తులు విరాళాలు అందించి సహకరించారు.
-కె.నరేంద్రస్వామి, ఆలయ అర్చకులు / న్యూస్‌టుడే - తంపటాపల్లి(పాలకొండ, గ్రామీణం)
- =========================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !