మండల పరిధిలో తహశిల్దారు కార్యాలయ ఆధ్వర్యంలో అధికారులు ఈ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహిస్తున్నారా?.. లేదా అనేది పరిశీలించేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం
జమాబంది. దీని ద్వారా అధికారుల సమర్ధపాలన, పారదర్శకత బయటపడుతుంది. ఇది బాగుంటే అభివృద్ధి జరుగుతున్నట్లే. ఏటా తహశిల్దారు కార్యాలయాల్లో జమాబందీ నిర్వహిస్తారు. ఇదంటే
రెవెన్యూ సిబ్బందికి ఉరుకులు.. పరుగులు. ఏటా దీని కోసం రెవెన్యూ యంత్రాంగమంతా పూర్తి అప్రమత్తంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో జమాబందీ నిర్వహిస్తున్నారు.
ఆమోద ముద్ర తప్పనిసరి
జూన్ నుంచి మే వరకు ఉన్న కాలాన్ని రెవెన్యూ సంవత్సరం(ఫసలీ)గా పరిగణిస్తారు. గ్రామాల్లో జరిగే భూ లావాదేవీలు, భూ లెక్కలను దస్త్రాల్లో నమోదు చేస్తారు. ఇలా నమోదు చేసిన వాటిని ఏటా
రెవెన్యూ విభాగంలోని ఆర్‌ఐ నుంచి తహశిల్దారు, కలెక్టరు నియమించే జమాబందీ అధికారి వీటిని పరిశీలించి ఆ ఏడాది దస్త్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని ఆమోద ముద్ర వేస్తారు. కలెక్టరు
నియమించిన అధికారి పరిశీలన జరిపి సంతకాలు పెడితేనే ఆ ఏడాది జమాబందీ పూర్తయినట్లు.
వెనుకబడి ఉన్నాం..
జిల్లాలో ఈ ఫసలీ సంవత్సరానికి 2012-13కు సంబంధించి 1422 జమాబంది పూర్తి చేయాల్సి ఉండగా.. ఈ ఏడాది 2011-12 ఫసలీ సంవత్సరానికి మాత్రమే జమాబందీ నిర్వహిస్తున్నారు. ఈ
ఏడాది మే రానుండడంతో 1423వ దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారులు ఆదిశగా శ్రద్ధ చూపడం లేదు. ఏటా ఆలస్యమవుతోంది. దీంతో పల్లెల్లో రెవెన్యూ వ్యవహారాలకు అధికారక
ఆమోదముద్ర లభించట్లే. జిల్లాలో ఇప్పటికీ శ్రీకాకుళం, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్.పేట, పాలకొండ, వంగర, రాజాం, టెక్కలి, పలాస, కవిటి ఇచ్ఛాపురంలలో 1421 ఫసలీ జమాబందీలే పూర్తి కాలేదు.
సరిపోతేనే..
గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ, జిరాయితీ, డీపట్టా, పోరంబోకు, బంజరు భూములు, తదితర వివరాలన్నీ ఏటా దస్త్రాల్లో నమోదు చేస్తుండాలి. ఆయా సంవత్సరంలో జరిగే మార్పులు, విక్రయాలు,
కేటాయింపులు, తదితర వివరాలన్నీ ప్రభుత్వ దస్త్రాల్లో ఉన్న వివరాలకు సరిపోవాలి. జమాబందీలో గ్రామ లెక్కలు-1, 2,3, 3ఎ, 4, 4ఎ,బి,సి 5, 6,7, 8, 8ఎ, 9, 11 విభాగాలుగా పరిగణించి
పరిశీలిస్తారు.
వీటిని పరిశీలిస్తారు..
* గ్రామ లెక్కలు-1లో ప్రభుత్వ భూములు, లీజు, డి.పట్టా, ఆక్రమణ భూముల సమగ్ర వివరాలు దస్త్రాల్లో నమోదు చేసి తహశిల్దారు కార్యాలయంలో ఉంచాలి.
* గ్రామలెక్కలు-2లో భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు చేర్పులు, మార్పులు, వారసత్వ భూముల బదలాయింపు, పేర్లమార్పు, పాసు పుస్తకాలు ఒకరి పేరుమీద నుంచి వేరొకరి పేరుమీద
మార్చడం తదితర అంశాలు పేర్కొనాలి. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదనేది పరిశీలిస్తారు.
* గ్రామలెక్కలు-3లో సర్వే నెంబర్లతో కూడిన వివరాలు, హక్కుదారుడి భూమి ఏ సర్వే నెంబర్లలో ఉంది, భూముల విలువ, నీటి వసతులు, భూమి రకాలు తదితర వివరాలు..
* గ్రామలెక్కలు-3ఎలో ఏటా పంటల వివరాలు, దిగుబడి, తదితర వివరాలు.
* గ్రామలెక్కలు-4లో మెట్టు, పల్లం భూముల వివరాలు, నీటి తీరువాపన్నులు, వసూలయ్యే పన్నులు, ఎంత వసూలు చేయాలి, ఏ రైతు ఎంత చెల్లించాలి, బకాయి ఎంత తదితర అంశాలు నమోదు
చేయాలి.ఈ వివరాలన్నీ వీఆర్వో రైతులకు వివరించాలి. పట్టాదారుడు వివరాలన్నీ వరుస నెంబర్లలో నమోదు చేసి ప్రతి పట్టాదారుడికి ప్రత్యేక ఖాతా నెంబరు కేటాయించి ఆ భూముల వివరాలు
అందులో నమోదు చేయాలి. దీనినే ఆర్వోఆర్ 1-బి రిజిస్టరు అంటారు.
* గ్రామ లెక్కలు-4ఎలో భూములు పల్లం, మెట్టు అని నిర్ధారణ అవ్వని భూములు, సెక్షను-4 ప్రకారం ఈ భూములను ఆర్‌ఐ పరిశీలించి అవి ఎందుకు వేటిలో పేర్కొనలేదో వివరాలు నమోదు చేసి
ప్రత్యేక దస్త్రం నిర్వహించాలి. నిర్ధారించాక ఏమేరకు వాటికి పన్ను వేయాలో పేర్కొనాలి.
* గ్రామ లెక్కలు-4బిలో నీటి తీరువా పన్నుల బకాయిలు, రాయితీలు, ఎవరు ఎంత బకాయి ఉన్నారో తదితర వివరాలు నమోదు చేయాలి. పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
* గ్రామ లెక్కలు4సిలో ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే వాటిని పరిశీలించి ఆయా వివరాలు నమోదు చేయాలి. ఆక్రమణదారుల్లో అర్హులైన వారుంటే పరిశీలించి వారికి పట్టా మంజూరు
చేసి హక్కులు కల్పించాలి. లేకుంటే వారిని తొలగించాలి.
* గ్రామలెక్కలు-5లో భూమి శిస్తు, నీటితీరువా తదితర వివరాలు, డిమాండు, వసూళ్లు, మిగులు వివరాలు ప్రతి రైతువారీ నమోదు జరగాలి. ఏ రైతు ఎంత బకాయి ఉన్నాడు, ఎంత చెల్లించాడు, ఎంత
చెల్లించాలనే అంశాలు తెలపాలి.
* గ్రామ లెక్కలు-6లో రోజువారీ వసూళ్లు తెలిపే రిజస్టరు నిర్వహించాలి. దీనికి సంబంధించి రశీదు రైతుకు ఒకటి అందజేసి,మరొకటి పుస్తకంలో ఉంచాలి. వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి
చలానా రూపంలో చెల్లించాలి.
* గ్రామలెక్కలు-7లో వసూళ్ల రకాలు అంశాల వారీగా నమోదు చేయాలి.
* గ్రామ లెక్కలు-8లో సాగునీటి వసతులు, జల వనరులు, చెరువులు, కాలువలు, భారీ, మధ్య, చిన్నతరహా సాగునీటి వివరాలు నమోదు చేయాలి.
* గ్రామలెక్కలు-8ఎలో జలవనరులకు సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా ఉంటాయి.
* గ్రామ లెక్కలు-9లో రెవెన్యూకు సంబంధించిన రశీదుల పుస్తకం ఒరిజినల్ రశీదు రైతుకిచ్చి దాని కాపీలు రెవెన్యూ కార్యదర్శి వద్ద ఉంచాలి.
* గ్రామ లెక్కలు-10లో జననాలు నమోదు చేయాలి.
* గ్రామ లెక్కలు-11లో మరణాలు నమోదు చేయాలి. వీటిని ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు.
* నాళా ఈ విభాగంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు అక్కడ ఉన్న భూమి విలువలో 9 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. ఇవేకాక ల్యాండ్ సీలింగు, మెట్టును
పల్లపు భూమిగా మార్చినప్పుడు తదితర వివరాలన్నీ నమోదు చేయాలి.
ఈ వివరాలతో కూడిన దస్తాలన్నీ సమగ్రంగా నిర్వహించి జమాబందీలో అధికారుల పరిశీలనకు సిద్ధంగా ఉంచాలి. ప్రతి గ్రామానికి చెందిన దస్త్రాలు సమగ్రంగా ఉండాలి.
సకాలంలో సరిచేయకపోవడం వల్లే
రెవెన్యూ సిబ్బంది సకాలంలో భూ దస్త్రాలు తయారు చేయకపోవడం వల్లే జమాబందీలో ఆలస్యం చోటుచేసుకుంటోంది. ఒక్కో దఫా పరిశీలనలో దస్త్రాలు సక్రమంగా లేకుంటే మళ్లీ సరిదిద్దాలని
సూచించడంతో ఆలస్యం తప్పడం లేదు. కొన్నిసార్లు అధికారులు పని ఒత్తిడి కారణంగా పరిశీలనలో ఆలస్యం జరుగుతుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే సంతకాలు చేయాల్సి ఉన్నందున సమగ్ర
పరిశీలన తర్వాతే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. జమాబందీతో ప్రభుత్వ ఆదాయ, వ్యయ, పారదర్శకతకు ఎంతో దోహదం. ఇది సక్రమంగా ఉండాలి.
- Courtesy with : గణేష్‌కుమార్, ఆర్డీవో, శ్రీకాకుళం@కలెక్టరేట్, న్యూస్‌టుడే
- ==============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !