Saturday, December 14, 2013

Falling of Sunrays on Shiva linga,శ్రీకాకుళం జిల్లాలో శివలింగానికి సూర్యకిరణార్చన

  •  
  
  •    

 ఒక శివాలయంలో రోజూ సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరిస్తుంటాయి. ఆ తరవాతే నిత్యపూజలు మొదలౌతాయి.  ఈ  విశిష్ట ఆలయం శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నాయి.

సాధారణంగా సూర్యదేవాలయాల్లో సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిగ్రహంపై పడుతుంటాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ దేవాలయమే. ఇలా సూర్యకిరణాలు పడే ఆలయం ఆ జిల్లాలో మరొకటి ఉంది. కాకపోతే అది శివాలయం. పాలకొండ పట్టణశివారులో (జిల్లాకేంద్రం నుంచి సుమారు 40 కి.మీ. దూరంలో) ఉన్న ఆ గుడి కంచికామాక్షమ్మ రాజలింగేశ్వరస్వామి ఆలయం.

సనాతనధర్మంలో ఏ పనిచేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధిస్తాం. తానూ అలాగే రోజును ప్రారంభిస్తానని చెప్పడానికా అన్నట్టు... ఈ ఆలయంలో సూర్యుడి లేలేత కిరణాలు సూర్యోదయ సమయంలో ముందుగా గణపతిమీద పడతాయి. అలా అయిదు నిమిషాలు కిరణాలు పడుతున్న తీరు... ఆదిత్యుడు భక్తితో గణనాథుణ్ణి పూజిస్తున్నట్టు ఉంటుంది. ఆ తరవాత గర్భాలయంలోని శివలింగాన్ని ఆరాధించడానికి వెళ్తున్నాడా అన్నట్టుంటాడు. అక్కడ రెండుమూడు నిమిషాలు సూర్యకిరణాలు పడతాయి. కాసేపటి తరవాత అమ్మవారిపైనా ప్రసరిస్తాయి. ఇలా ఒకరోజుకాదు, రెండ్రోజులు కాదు... నిత్యం పడటం విశేషం. రోజూ సూర్యకిరణాలు మూలవిరాట్టులపై ప్రసరించిన తరువాతనే ఆలయంలో నిత్యపూజలు ప్రారంభిస్తారు. సాధారణంగా శివాలయాల్లో గర్భగుడిలో శివలింగం ఒక్కటే ఉంటుంది. కానీ, ఈ ఆలయంలో గర్భగుడిలోనే శివలింగమూ దానివెనుక అమ్మవారి విగ్రహమూ ఉంటాయి.

ఆలయ స్థలపురాణం ప్రకారం.. ఈశ్వర అంశగా భావించే సనారీవిశ్వేశ్వర స్వామి అవధూత పలు ప్రాంతాలు సందర్శించుకుంటూ 19వ శతాబ్దం నాటికి పాలకొండకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఆయన తపస్సు చేశారట. 'ఆయన పరమపదించిన తరువాత స్వామి భక్తులైన అమృతలింగాచారి, లింగాచారి సోదరులకు కలలో కనిపించి, తాను తపస్సు చేసిన స్థలంలో శివాలయాన్ని నిర్మించాలని చెప్పారట. దాంతో సోదరులిద్దరూ 1897లో ఆలయాన్ని నిర్మించారట. ఆలయంకోసం అప్పట్లోనే ఎనిమిది ఎకరాల పొలాన్ని ఇచ్చారు. ఆ వంశస్థులమే ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాం. అందులో మేం నాలుగోతరం వాళ్లం' అని చెబుతారు ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద్‌పండా.

ఆలయంలో శివరాత్రినాడూ, కార్తీకమాసంలోనూ, శరన్నవరాత్రుల్లోనూ, ఇతర పర్వదినాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని జ్యేష్ఠశుద్ధ
షష్ఠినాడు ఒడిశా సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించి, అన్నదానం చేస్తారు.

courtesy with Eenadu sunday magazine-August 04, 2013
- జి.నిరంజన్‌పట్నాయక్‌, న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం
- చంద్రమౌళిక సాపిరెడ్డి, ఈనాడు పాత్రికేయ పాఠశాల


  • =========================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

1 comment:

Your comment is important for improvement of this web blog . Thank Q !