నాగావళి పాత వంతెనకు 159 ఏళ్లు-నేలమట్టం కానున్న పురాతన వంతెన-మిగిల్చిన మధుర స్మృతులెన్నో...రిక్షాకార్మికులకు రాత్రిపూట ఇదే ఆసరా..రాకపోకలతో నిరంతర రద్దీ........2013 May 18న కూల్చివేత.
సిక్కోలు... నాకేమవుతుంది... సిక్కోలుకు.. నేనేమవుతాను.. ఏమో.. 159 ఏళ్లుగా ఒకరికి ఒకరుగా .. దేహం.. ఆత్మగా కలిసిపోయాం.. వరదలోస్తే గుండెల్లో దాచుకొన్నాను.. కష్టమెస్తే కళ్లలో కాచుకొన్నాను.. అలిసిపోతే పరుపునయ్యాను.. పండగొస్తే సంబరమయ్యాను.. నాలుగైదు తరాల బిడ్డలు నాతో ఆడుకొన్నారు.. పాడుకొన్నారు.. నా ఒడిలోనే పెరిగి పెద్దయ్యారు.. నాలోనే కలిసిపోయారు.. ఇప్పుడు నా వంతు వచ్చింది. నాకు ఆయుష్షు నిండిపోయిందంటున్నారు.. నేడు నిట్టనిలువునా కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతే.. పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందే.. ఇది ప్రకృతి ధర్మం. మీకు నా కంటే బాగా కాపాడేందుకు మరొకరు వస్తారంటే నా కంటే సంతోషించే వారు మరొకరు ఉండరు.. అంత కంటేనాకేం కావాలి. ఆనందంగా వెళ్లిపోతా మిత్రమా... ఇన్నేళ్లుగా మన మధ్యం ఉన్న అనుబంధం నేటితో తెగిపోనుంది. ఇక నన్ను మర్చిపోండి... నేనుంచిన మధుర స్మృతులను మాత్రం కాదు...ఇక సెలవ్!
- నాగావళి పాత వంతెన
158 ఏళ్లుగా పట్టణ జనాభాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. 1986 ప్రాంతంలోనూ, అలాగే 1990, 2006 లో వచ్చిన భారీ వరదలను తట్టుకొని నిలబడడంతో పట్టణంలోని ప్రజలు ప్రశాంతంగా వూపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఏమాత్రం వంతెన దెబ్బతిన్నా పట్టణంలో ఒక్కమనిషి కూడా కనిపించే పరిస్థితి లేకుండా పోయేది. ఒకానొకదశలో వంతెనపైనుంచే నీరు ప్రవహించినప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచిన ఘనత ఈ వంతెనది. ఇలా ఏ రకంగా చూసుకున్నా 15 దశాబ్దాలుగా ఆటుపోటులను ఎదుర్కొని ప్రజానీకానికి రక్షణగానూ, ప్రశాంతతను అందించి ఎన్నెన్నో మధుర స్మృతులను మిగిల్చి నేడు నేలమట్టానికి సిద్ధమైపోయింది.
* శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డున ఉన్న నాగావళి పాత వంతెన నేలమట్టం కానుంది. ఒకప్పుడు జీటీ రోడ్డు (గ్రాండ్ ట్రంక్ రోడ్డు) విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే ప్రధాన రహదారి. ఈ వంతెన పైనుంచే అంతర్‌రాష్ట్రాలకు సాధారణ, భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగేవి. బ్రిటీష్ హయాం నాటి ఈ వంతెన నేడు కనుమరుగు కానుంది. 159 ఏళ్ల చరిత్ర గల ఈ వంతెనకు శ్రీకాకుళం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రజలతో అనుబంధం పెనవేసుకుపోయింది.
ఇదీ దీని చరిత్ర
1854 నాటి ఈ వంతెన ఆర్క్ బ్రిడ్జి మోడల్‌లో నిర్మించారు. 314 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు, 24 ఖాణాలు, ఖాణాకు ఖాణాకు మధ్య 36 అడుగుల వెడల్పుతో నిర్మించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడంతో విజయవంతంగా 159 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇప్పటికీ రాకపోకలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉంది.
ఇదీ ప్రజానీకంతో వంతెన అనుబంధం
పట్టణ ప్రజలతో పాటు జిల్లా ప్రజానీకానికి వంతెనకు ఎనలేని అనుబంధం ఉంది. సాయంత్రం అయితే చాలు పట్టణ ప్రజలు ఈ వంతెనవైపుగా పయనమవుతుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణ అనంతరం ప్రశాంతత కోసం పాతవంతెన వైపు వెళ్లి చల్లని గాలులను ఆస్వాదిస్తూ.. కాసేపు సేదతీరుతారు. యువత, వృద్ధులు, వ్యాపారులు అన్న తేడా లేకుండా సాయంత్రం వేళ అలా నడుచుకుంటూ..వెళ్లి నాగావళి అందాలను వీక్షిస్తూ...పరవశం చెందుతుంటారు.
నిరంతరం రద్దీ..
పట్టణానికి వచ్చిపోయే ప్రజలతో నిరంతరం ఈ వంతెన ఎంతో రద్దీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భవన నిర్మాణ కార్మికులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు,ఉద్యోగులతో నిత్యం రద్దీగానే కనిపిస్తుంది. ప్రతిరోజూ వేలసంఖ్యలో జనం వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ ఎంతో దీటుగా నిలబడింది.
2013 May 18న కూల్చివేతకు సిద్ధం:
పాత వంతెన ఈ నెల 18న కూల్చివేసేందుకు ప్రతిపాదించినట్లు రహదారులు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు పి.మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాగావళి నదిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో రెండులైన్ల హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.16కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
- =============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !