Monday, October 1, 2012

Asha workers in Srikakulam-శ్రీకాకుళం లోఆశాకార్యకర్తలు




ప్రజలకు వైద్య, ఆరోగ్యశాఖకు అనుసంధానంగా సేవలందిస్తున్న వారు ఆశాకార్యకర్తలు.పల్లెల్లో... పట్టణాల్లో గల్లీగల్లి తిరుగుతూ ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ...ఆరోగ్య ప్రదాతలుగా నిలుస్తున్నారు. గర్భవతులకు, కిషోర  బాలికలకు సూచనలు, సలహాలు అందజేస్తూ వారికి నిరంతరంగా సేవలను అందజేస్తున్నారు.  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ.. కుటుంబ సంక్షేమ  శస్త్ర  చికిత్సలను ప్రోత్సహించడం, వ్యాధి నిరోధక టీకాలు  వేయిండచం..పల్స్‌పోలియో తదితర ప్రత్యేక కార్యక్రమాల్లో వైద్య సిబ్బందికి గ్రామ స్థాయిలో సహాయపడుతున్న ఆశా కార్యకర్తలకు సరిపడ నెలసరి జీతాలు లేవు కాని ప్రభుత్వం ప్రోత్సకాలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌  నుంచి ఆదేశాలు వచ్చాయి. వీరికి నిర్థిష్ట వేతనాన్ని ప్రభుత్వం నిర్ణయించలేదు.నెలకు 450 రూపాయల వేతనంతో పాటు  ఫలానా పనికి ఇంత అని  నిర్ణయించి ప్రోత్సాహకాలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం వీటిని కాస్త  పెంచడంతో ఆశాలకు కొంత వూరట నిచ్చింది.


జిల్లాలో 2785 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. ఇందులో 940 మంది కార్యకర్తలు ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు. గ్రామాల్లో వైద్యశాఖకు సంబంధించిన సమస్య తెలిస్తే వెంటనే సంబంధిత ఎఎన్‌ఎం, పీహెచ్‌సీ వైద్యులకు సమాచారం తెలియజేయడం వీరి ప్రధాన విధి. గర్భిణిలను ప్రతినెలా ఆసుపత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయించడంతోపాటు వారికి నెలవారీ టీకాలు, ఆసుపత్రిలో ప్రసవం చేయించే విధంగా కృషి చేస్తున్నారు. ఆయా పనులకు నిర్ణయించిన మేర ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోంది.

  • పెరిగిన ప్రోత్సహకాలు
గర్భిణులు ప్రసవమైన తరువాత 3, 7, 14, 21, 42 రోజుల్లో వాళ్ల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుని వైద్యులకు సమాచారం అందించడానికి గతంలో రూ.25 ఇచ్చేవారు. అది ప్రస్తుతం రూ.50కు పెంచారు. ప్రతినెలా మెదటి  మంగళవారం ఆసుపత్రిలో జరిగే సమావేశానికి హాజరైతే రూ. 75 నుంచి రూ.100కు పెంచారు. తక్కువ బరువు ఉన్న బిడ్డను ఆసుపత్రికి తెచ్చి పౌష్టికాహారం   అందించేందుకు ఇచ్చే ప్రోత్సాహకం రూ. 50 నుంచి రూ. 100కు పెరిగింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించేందుకు ఇచ్చే రూ. 50ను రూ.150కు పెంచారు. మగవారికి కు.ని.శస్త్ర చికిత్స చేయిస్తే రూ.200 ఇవ్వనున్నారు.

  • కొత్త ప్రోత్సాహకాలు
పాత వాటిని పెంచడంతోపాటు ప్రభుత్వం కొత్తగా మరికొన్ని ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. హెచ్‌ఐవీ పొజిటివ్‌ గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించి బిడ్డకు బీసీజీ, పచ్చకామెర్లు, పోలియో, తదితర వ్యాధి నిరోధక టీకాలు వేయించేందుకు రూ.500 ఇవ్వనున్నారు. నెలకు ఒక్కసారి గర్భిణులకు, బాలింతలకు, కిషోర్‌ బాలికలకు ఏఎన్‌ఎం ఆధ్వర్యంలో ఆరోగ్య సూత్రాలపై  అవగాహన కల్పించేందుకు నెలకు రూ. 150 ఇవ్వనున్నారు.
  • జెఎస్‌వై..
జననీ సురక్ష యోజన పథకం ద్వారా బాలింతలకు రూ.600 నుంచి రూ.1000 వరకు ప్రోత్సహకాన్ని పెంచింది.18 ఏళ్లు నిండిన బాలింతలకు 1, 2 కాన్పులు వరకు ఈ పారితోషకం లభిస్తుంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొనే వారికి రూ. 600 పెంచనున్నది. ఇవన్నీ సెప్టెంబర్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నాయి.

  • ఆనందదాయకమే--మా కష్టానికి తగ్గట్టు ప్రోత్సహకాలు ఇవ్వడం లేదు. కూలికి వెళ్తే రోజుకు కనీసం రూ. 150 వస్తుంది. నెలంతా కష్టపడితే రూ. వెయ్యి లోపే వస్తుంది.ఇప్పుడు ప్రోత్సహకాలు పెంచడం ఆనందదాయకమే. --వనజాక్షి, ఆశ కార్యకర్త, రావిచెంద్రి.

ఉత్తర్వులు అందాయి
ప్రోత్సాహకాలు పెరిగినట్లు రాష్ట్ర కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇది ఆశా కార్యకర్తలకు కొంతమేర వూరట కలిగించే విషయమే. వారు మరింత బాధ్యతగా విధులు నిర్వహించాల్సి ఉంది.---శ్యామలాదేవి, డీపీఎంవో, శ్రీకాకుళం

పనికి తగ్గ వేతనం కాదు
ఆశ కార్యకర్తలకు పనికి తగ్గ వేతనం ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతం కంటే పెంచిన ప్రోత్సహకాలు వల్ల కొంత ఆనందదాయకం. ప్రోత్సాహకాల స్థానంలోవేతనాలు అందజేయాలి. -నాగమణి, కార్యదర్శి సిటు,శ్రీకాకుళం

Courtesy with Eenadu news paper.(01-Octo 2012)
  • =====================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !