Monday, October 1, 2012

Mahendragiri Rivers in Srikakulam,శ్రీకాకుళం మహేంద్రగిరుల నదులు బాహుదా-మహేంద్రతనయతూర్పు కనుమల్లో కన్నీటి సుడులు -మహేంద్రగిరుల నీటిపై నిర్లక్ష్యం-జల వనరులు అపారం-వృథాగా సముద్రంపాలు-సద్వినియోగపరిస్తే 2 లక్షల ఎకరాలకు నీరు--- ఈనాడు ప్రత్యేక కథనం :

  • వర్షం చుక్కను ఒడిసిపట్టకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని నిపుణుల హెచ్చరికలు పాలకులు పెడచెవిన పెడుతున్నారు. తూర్పు కనుమల్లో ఎత్తయిన మహేంద్రగిరులు.. జిల్లాలో ఎక్కువ భాగం వ్యాప్తి చెంది ఉండడంతో అక్కడ అపారమైన వర్షాలు కురుస్తున్నాయి. మహేంద్రగిరుల నుంచి వచ్చే వరదనీటిని సద్వినియోగపర్చుకునే పరిస్థితి లేకపోవడంతో వృథాగా సముద్రం పాలవుతోంది. కొండలపై కురిసిన వర్షం నీటిని ఒడిసిపట్టే విధంగా అప్పటి కాలువ వ్యవస్థ.. సాగరాలు.. ఇతర నీటి వనరులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో అవి ఉనికి కోల్పోతున్నాయి. అపారమైన నరులున్నా..వ్యవసాయానికి ఉపయోగపడని దుస్థితి నెలకొంది. వరదనీటిని ఒడిసి పట్టే పరిస్థితి లేకపోవడంతో ఖరీఫ్‌.. రబీ పంటల విస్తీర్ణం నానాటికి గణనీయంగా తగ్గిపోతోంది.


జిల్లాలో ప్రవహిస్తున్న నదులన్నింటినీ ఒడిశా ప్రభుత్వం సద్వినియోగపర్చుకొని అక్కడ పంట పొలాలను సస్యశ్యామలం చేసుకుంటోంది. ఇక్కడ వరదనీటిని సైతం వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. మహేంద్రగిరుల ఆధారంగా టెక్కలి డివిజన్‌లో ఉన్న అపారమైన సాగునీటి వనరుల్లో నీటి నిల్వ కోసం సరైన ఏర్పాట్లు చేసుకుంటే 2 లక్షల ఎకరాల పంట పొలాలకు ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగునీటి సమస్యే ఉత్పన్నం కాదు. ఈ వనరులను అభివృద్ధి చేయాలని రైతులు ఎంతగా మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వపరంగా స్పందన కరవయ్యింది. అన్నదాతకు వ్యవసాయంపై శ్రద్ధ తగ్గే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

వందల క్యూసెక్కుల నీరు వృథా
బాహుదా, మహేంద్రతనయ నదులపై ఆనకట్టలు నిర్మించాలనే రైతులు మొరపెట్టుకుంటున్నప్పటికీ పట్టించుకునేవారే కరవయ్యారు. వర్షాకాలంలో మహేంద్రగిరుల నుంచి చేరే వరదనీరు సైతం ఈ నదుల్లో నిల్వ ఉండే పరిస్థితి లేకుండాపోయింది. పెద్దఎత్తున వచ్చే వరదనీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల రైతులు సాగునీటి కోసం ఆకాశంవైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే నమోదవుతున్నప్పటికీ నదుల్లో మాత్రం నీటి జాడలు కనిపించడంలేదు. వర్షాలు కురిసిన రెండు మూడు రోజులు నీటి ప్రవాహం తప్పిస్తే మిగిలిన రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుంది. ఈ రెండు నదులపై ఆనకట్టలు నిర్మించి మినీ జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు, కాలువల ద్వారా మళ్లింపు చేపడితే సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఒడిశా నుంచి ఆంధ్రాకు రావల్సిన వాటా నీరు రావడం లేదని గగ్గోలు పెట్టడం తప్పిస్తే మహేంద్రగిరుల వరదనీటిని నిల్వ చేసే అంశంపై దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరం. రెండు నదుల నుంచి వందల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది.

10 శాతం కూడా నీరు నిల్వ ఉండదు
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 60 శాతం పంట పొలాలకు సాగునీటిని అందించే బీల ప్రాంతం అభివృద్ధిపై కన్నెత్తి చూడడంలేదు. మహేంద్రగిరుల నుంచి బీలలో చేరుతున్న వరదనీరంతా వృథాగా పోతుంది. సోంపేట మండలం బారువ నుంచి కవిటి మండలం ఇద్దివానిపాలెం వరకు 18 కిలోమీటర్ల పరిధిలో బీలబట్టిని అభివృద్ధి చేయడంతోపాటు సహజ సిద్ధంగా ఏర్పడిన పెద్దబీల, చిన్నబీల జలాశయాలను సద్వినియోగపర్చుకునేలా పనులు చేపడితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తే కాలువల ద్వారా మెరక ప్రాంతానికి కూడా నీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. వర్షాకాలంలో బీల నుంచి కూడా వందల క్యూసెక్కుల నీరు ఇద్దివానిపాలెం, ఒంటూరుల వద్ద సముద్రంలో కలుస్తుంది. కనీసం 10 శాతం నీటిని నిల్వ చేసినా సాగు, తాగునీటి ఇబ్బందులకు పూర్తిస్థాయి పరిష్కారం లభించే అవకాశం ఉంది.

గ్రోయిన్‌లపై చిన్నచూపు
బారువ, ఏటిబట్టి, మూలపొలం, పొత్తంగి గ్రోయిన్‌ల ద్వారా సోంపేట, మందస, కంచిలి మండలాల పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నప్పటికీ ఏళ్ల తరబడిగా గ్రోయిన్‌ల మరమ్మతులు చేపట్టకపోవడంతో నీటి నిల్వకు అవకాశం కుదరడంలేదు. రాళ్ల పేర్పిడితే నిధులు దుర్వినియోగం చేయడం తప్పిస్తే అక్కడ మినీ ఆనకట్టలు నిర్మిస్తే రెండు పంటలకు సాగునీటిని అందించే అవకాశం ఏర్పడగలదని రైతులు ఎంతగా మొరపెట్టుకుంటున్నప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. పొత్తంగి గ్రోయిన్‌ రాతి కట్టడం నదీ గర్భంతో సమానంగా తయారుకావడంతో నీరు కాలువ ద్వారా వెళ్లేందుకు అవకాశం లేకుండాపోయింది. బారువ గ్రోయిన్‌ వద్ద మినీ ఆనకట్ట హామీలకే పరిమితం కావడంతో కాలువ ప్రధాన భూములకే సాగునీరు పరిమితమైంది. మూలపొలం గ్రోయిన్‌ ద్వారా చుక్కనీరు కూడా పంట పొలాలకు చేరడంలేదు. కొద్దిపాటి నిధులు వ్యయం చేస్తే గ్రోయిన్‌లు పూర్తిస్థాయిలో సద్వినియోగపడడంతోపాటు నీటి వృథాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు.

ఉనికికోల్పోతున్న 'పైడిగాం'
టెక్కలి డివిజన్‌లో ఏకైన మధ్య తరహా నీటి ప్రాజెక్టు పైడిగాం ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఒడిశా నుంచి రావల్సిన 80 క్యూసెక్కుల నీటి వాటాలో 30 క్యూసెక్కులు కూడా చేరడంలేదు. కాగా మహేంద్రగిరులపై కురిసిన వరదనీటిని కూడా వినియోగించుకునే పరిస్థితి ప్రాజెక్టులో కల్పించలేదు. ఆనకట్ట నదీ గర్భానికి సమానంగా మారడంతో పెద్దఎత్తున నదిలో వరదనీరు చేరితే తప్ప పైడిగాం కాలువ ద్వారా నీటి సరఫరా సాగడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 10 వేల ఎకరాల పంట పొలాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. మూడు వేల ఎకరాలకు కూడా ఖరీఫ్‌లో నీరందడం లేదంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. హంసమేరతోపాటు మరో రెండు చోట్ల మినీ రిజర్వాయర్లు నిర్మించి నీటిని ప్రాజెక్టులోకి మళ్లించాలని రైతులు పోరాడుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. కురిసిన వర్షం నీరు వృథాగా పోవడం తప్పిస్తే దానిని నిల్వ చేసే అవకాశం లేకుండాపోయింది.

సాగరాల సంగతి .
మహేంద్రగిరుల ఆధారంగా ఉన్న వందల విస్తీర్ణం కలిగిన సాగరాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో నీటి నిల్వకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజులు నిర్మించిన పలు సాగరాలు మరమ్మతులకు గురై మదుములు శిథిలావస్థలో ఉన్నప్పటికీ వాటి గురించి పట్టించుకోకపోవడంతో వరదనీరు నిల్వకు అవకాశం లేకుండాపోతుంది. మహేంద్రగిరుల ఆధారంగా తమిరి, సుంకిలి, నారాయణ, హనుమంతు, గంగా, ముకుంద, రామ సాగరాలతోపాటు ఇతర పెద్ద చెరువులకు నీరు చేరుతుంది. మదుములు పునరుద్ధరించకపోవడంతో ఆయా సాగరాల్లో నామమాత్రంగా మాత్రమే నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. వీటిని సద్వినియోపరిస్తే రెండు పంటలతోపాటు తాగునీటి సమస్యలకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉన్నప్పటికీ ఎటువంటి కదలిక లేదు.

కొండపై కురిసిన నీటిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని పోరాడుతున్నా పాలకులు మాత్రం స్పందించడంలేదు. బీల ప్రాంతంతోపాటు పైడిగాం ప్రాజెక్టు గ్రోయిన్‌లు అభివృద్ధి పరిస్తే వర్షాకాలంలో నీటి వృథాను అరికట్టవచ్చు. దీనిమూలంగా ఖరీఫ్‌, రబీ సీజన్‌లు సస్యశ్యామలమవుతాయి. తాగునీటికి కూడా ఇబ్బంది తొలుగుతుంది. ఉన్న నీటిని వినియోగించుకోలేని దుస్థితి టెక్కలి డివిజన్‌ రైతులకు నెలకొనడం దురదృష్టకరం. ఇన్ని ప్రాజెక్టులు, నదులున్నప్పటికీ పాత కాలం చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది.---సనపల శ్రీరామ్మూర్తి, రైతు నాయకుడు

వర్షాకాలంలో మహేంద్రగిరులపై నుంచి వచ్చిన వరదనీటిని పదోవంతు నిల్వ చేసుకున్నా సాగునీటి సమస్యలు ఉత్పన్నం కావు. పైడిగాం లాంటి ప్రాజెక్టులు రైతన్నకు కనీసస్థాయిలో కూడా ఉపయోగపడడంలేదు. వరదనీటిని ప్రాజెక్టులోకి మళ్లించే విధంగా జలాశయం నిర్మించాలని రైతులు పోరాడుతున్నా స్పందించడంలేదు. మహేంద్రతనయపై కనీసం ఆనకట్టలు కూడా నిర్మించలేని దుస్థితి నెలకొనడం దురదృష్టకరం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సాగు, తాగునీటికి యుద్ధాలు చేసుకోవల్సి ఉంటుంది.--శిలగాన భాస్కరరావు, రైతు ప్రతినిధి

Courtesy with Eenadu news paper
  • ==================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !