Tuesday, October 30, 2012

Water resources in Srikakulam- శ్రీకాకుళం జిల్లాలోజలవనరులు .  • Courtesy with : IndiamapAtlas.com/

సిక్కోలు.. అపార జల వనరులకు పుట్టినిళ్లు.. సహజ జలాశయాలకు కొదవేలేదు..  ఇక్కడ బంగారు పంటలు పండుతాయి .. వరద నీటిని ఒడిసి పట్టుకొని.. జలాశయాల్లో నింపి అన్నదాత పొలాలను సశ్యస్యామలము చేయాలని ఎవరూ అనుకోవడం లేదు .. వచ్చిన నీటిని తరలించడంలో విఫలమవుతున్నారు. కేవలం జలాశయాల్లో వరద నీటిని నింపితే 3 లక్షల ఎకరాలకుపైగా సాగునీటిని అందించవచ్చు.. చెరువులు.. కాలువలు.. ఇలా వనరులు నిర్లక్ష్యానికి గురికావడంతో అన్నదాత ఏటా ఆకాశం వైపు చూడక తప్పలేదు..

* వంశధార నదిలో వరదలకు గరిష్ఠంగా 1.50 లక్షల క్యూసెక్కుల నీరు నిల్వచేసుకోవచ్చు. పరిధి దాటింది. నీటిని దిగువకు విడిచిపెట్టేశారు. మళ్లీ ఎండలు ముదిరాయి. నీరు ఆవిరవుతోంది.
* నాగావళి నదిలో లక్ష క్యూసెక్కుల వరద నీటిని నిల్వచేసి వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం 65వేల క్యూసెక్కుల నీరు ఉంది.
* మహేంద్ర తనయ నది రెండు పాయలలోనూ 15వేల నుంచి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
* బాహుదా నది విషయానికి వస్తే పదివేల క్యూసెక్కుల లోపునే నీరు వచ్చింది. మొత్తంపై జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలకు, కొండలపై పడిన నీటి ద్వారా వచ్చిన సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు సాగరానికే చేరిందని అధికారుల అంచనా.

నీటిపారుదల శాఖ గత ఐదేళ్లలో తీసిన లెక్కల ప్రకారం వరదనీటి ప్రవాహం తీరు ఇది. నీటి నిల్వ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గతంలో నిర్మించిన ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడం, కొత్త నిల్వ ప్రాంతాలను గుర్తించడం చేయకపోవడంతో జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైనున్న ఒడిశా ఎలాగూ అన్యాయం చేస్తోంది. కనీసం వరద నీటినైనా పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా మన పాలకులు చేయాల్సిన అవసరం ఉంది.

ఖరీఫ్‌.. ఈ కాలం కోసం జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఎదురుచూస్తుంటారు. ఏడాది పొడవునా ఆదుకునే పంటలకోసం ముందస్తుగా శ్రమిస్తుంటారు. ప్రధానమైన నదులు ఉన్నా.. ఎగువనున్న ఒడిశా అక్రమాల కారణంగా సాగు, తాగునీటికి అవస్థలు పడే జిల్లా ఇది. అపారమైన జలసంపదల ద్వారా వచ్చే వరద నీటిని అయినా నిల్వచేసే ప్రణాళికలు అమలుకాకపోవడంతో ఎపుడూ కరవు కోరల్లోనే చిక్కుకుంటోంది. అయితే ముంపు.. లేకుంటే కరవు.. ఇదీ జిల్లా పరిస్థితి. కళింగదల్‌, డబార్సింగ్‌, బెండిగెడ్డ, గజిలి గెడ్డ, తోటపల్లి, నారాయణపురం, పైడిగాం, బొడ్డేపల్లి రాజగోపాలరావు ఎడమ, కుడి కాలువలు, మడ్డువలస.. ఇలా జలాశయాలు ఉన్నా, వాటికి నీటి చేరిక అంతంత మాత్రమే. ఇప్పుడున్న కట్టడాల్లో ఒక స్థాయి వరద వరకు నీటిని నిల్వచేసుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదానది, మహేంద్రతనయ నదులతో పాటు ఉపనదులు, వందల ఎకరాల విస్తీర్ణం గల ఆయకట్టు చెరువులు ఎన్నో ఉన్నాయి.

వివిధ ప్రాజెక్టుల పరిధిలో భూముల వివరాలు
* కళింగదళ్‌ జలాశయం: 3,595 ఎకరాలు
* డబార్సింగ్‌: 1,185 ఎకరాలు
* తోటపల్లి రెగ్యులేటర్‌: 31,728 ఎకరాలు
* నారాయణపురం ఆనకట్ట: 37,053 ఎకరాలు
* పైడిగాం ప్రాజెక్టు: 5,183 ఎకరాలు
* బొడ్డేపల్లి రాజగోపాలరావు రిజర్వాయర్‌:

ఎడమ కాలువ: 1,48,230 ఎకరాలు
కుడి కాలువ: 62,280 ఎకరాలు

* మడ్డువలస జలాశయం: 24,200 ఎకరాలు
మొత్తం అన్ని జలాశయాల నుంచి: - 3,14,912 ఎకరాలు

* ఇవి కాక పంచాయతీరాజ్‌ నిర్వహణలో..
ఏడువేల పెద్ద చెరువుల ద్వారా - 2,52,773 ఎకరాలు

* చిన్న, మధ్యతరహా నీటివనరులు 1,027 ఉన్నాయి. వీటి ద్వారా 1,59,808 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
వనరుల రూపాలను అనుసరించి పంట భూములను పరిశీలిస్తే..

* కాలువల ఆధారంగా 2,57,780 ఎకరాలు
* చెరువులు ద్వారా 1,68.340 ఎకరాలు
* గొట్టపుబావుల ద్వారా 9,697.50 ఎకరాలు
* వూటబావుల ఆధారంగా 8,955 ఎకరాలు
* ఇతర వనరుల ద్వారా 1,212.50 ఎకరాలు..

* ఆంధ్రా ప్రభుత్వంతో ఒడిశా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రాకు నదుల ద్వారా నీటిని వదిలితే ఏ సమస్య ఉండదు. వరదొస్తేనే నీరు కనిపించే ఆంధ్రా నదులు, వాటి ఆధారంగా సాగు చేసుకోవాలని ఎదురు చూస్తున్న అన్నదాత దుస్థితి చూసి అయినా ఎగువ రాష్ట్రం స్పందించాల్సిఉంది. పాలకుల నిర్లక్ష్య ఫలితమే--వచ్చిన నీటిని అయినా నిలబెట్టుకుంటే, కరవు పరిస్థితులు తలెత్తేవి కావు.

ఒడిశాతో అనుబంధం
* జిల్లా మీదుగా ప్రవహించే నదులన్నీ ఒడిశాతో అనుబంధమైనవే. ఒడిశా కొండలలో పుట్టి, ఆయా ప్రాంతాల మీదుగా ఆంధ్రాకు చేరి, ఆపై సాగరానికి తరలిపోతున్నాయి. నాలుగు నదులపై ఒడిశాలో వందల సంఖ్యలో అతి పెద్ద జలాశయాలు, ఎత్తిపోతల, మినీ ఎత్తిపోతల పథకాలు, ప్రధాన కాలువలకు వందల సంఖ్యలో ఉపకాలువల నిర్మాణాలు, మినీ జలాశయాల నిర్మాణాలు చేపట్టారు. ఇవే నదీ జలాలను వినియోగించుకుని అక్కడ ఏటా మూడు పంటలు పండిస్తే, ఇక్కడ ఖరీఫ్‌కూ నీరందని పరిస్థితి ఏర్పడుతోంది.

* ఒడిశాలో జలవనరుల సంరక్షణ, వినియోగంపై ఇక్కడి పాలకులు, అధికారులు అధ్యయనం చేస్తే, నీటి వృథాను నివారించవచ్చు. ఈ విషయాన్ని ఇచ్ఛాపురం మండల సరిహద్దులో ఉన్న బొడ్డబడ గ్రామాన్ని సందర్శించిన గత ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు, పక్కనే ఉన్న ఒడిశా గ్రామం భీమ్‌పురం వెళ్లారు. అక్కడ నదీ తీరంలో క్రాస్‌గా నిర్మించిన గట్లను పరిశీలించారు. ఇవి నీటిని కాలువలలోకి మళ్లించడమే కాకుండా, గ్రామాలకు రక్షణ ఇస్తున్నాయి. ఈ అంశాన్నే అప్పటి కలెక్టర్‌ టి.వెంకట్రామ్‌రెడ్డికి నివేదించారు. ఇదే తరహాలో పరిశీలన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అక్కడిలా నాలుగైదు గ్రామాలకు కలిపి మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటుచేస్తే ఆ ప్రాంతాలకు సమృద్ధిగా జలాలు పారుతాయి.

నదీ జలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు సర్కారు పెద్దలు ప్రత్యేక దృష్టిని సారించాలి. ఇంజినీర్ల పనితనాన్ని వినియోగించుకుని, ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి వరద నీటిని నిల్వ చేస్తే, ఒక ఏడాది వర్షాలు కురవకున్నా.. ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. లక్షలకొద్ది క్యూసెక్కుల జలాలను వృథాగా సాగరం పాలు కాకుండా ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేయడం అవసరం.


:జిల్లాలోని నదుల పరిస్థితి చూస్తే చాలా ఆవేదన కలుగుతోంది.  వర్షాకాలంలో వచ్చిన తుపానుల కారణంగా వచ్చే జలాలను కూడా మిగుల్చుకోలేకపోతున్నాం. నదీజలాల వినియోగంలో ఒడిశా చక్కటి పద్ధతులను అవలంబిస్తోంది. అవి స్వార్థపూరితంగానే ఉన్నా, అక్కడ రైతుల సంక్షేమానికే పెద్దపీట వేస్తోంది. బాహుదా, మహేంద్రతనయ నదుల జలాలను సమీపంలోని పెద్ద చెరువులకు మళ్లించేలా చేయాలి. ఎత్తిపోతల పథకాలను సమర్థంగా పనిచేసేలా చేయాలి. అందుకు అధ్యయనం అవసరం. పాదయాత్రలో అన్నీ పరిశీలిస్తాం. ఆయా ప్రాంతాలలోని రైతులతో మాట్లాడి, అధికారుల ద్వారా మరోసారి అధ్యయనం చేయిస్తాం. ఆపై ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి పనులు చేయిస్తాం. బాహుదా బ్యారేజ్‌ విషయమై జిల్లాకేంద్రం మొదలుకుని న్యూఢిల్లీ కేంద్రం వరకు అందరినీ కలిశాను. అలాగే అన్నారే తప్పా, కార్యాచరణ శూన్యం. ............-పిరియా సాయిరాజ్‌, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం.

Courtesy with : Icchapuram news today @Eenadu daily


  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !