Saturday, November 10, 2012

Srikakulam Telugu Students education in Oriss State - ఒరిస్సా లో శ్రీకాకుళం తెలుగు వారి చదువులు



  •  తెలుగును బతికించేందుకు పాట్లు :
  • ఒడిశాలో పౌరసత్వం..ఆంధ్రాకు వచ్చి చదువు--ఒడిశాలో తెలుగువారు అన్యాయానికి గురవుతున్నారు.. అక్కడ చదువుకునేందుకు అవకాశాలు తగ్గాయి.. దూరంగా ఉన్న ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలకు వచ్చి చదువుకుంటున్నారు. కొందరు నదులు దాటి వస్తున్నారు. మరికొందరు సైకిళ్లపై వచ్చి రాత్రి సమయాల్లో ఇళ్లకు  చేరుతున్నారు. . ఒడిశాలోని తెలుగు పాఠశాలలు సైతం ఒరియాలోకి మారిపోతున్నాయి. తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి.

2012 డిసెంబర్  నెలలో తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా శనివారం బరంపురంలో ప్రాంతీయ సాంస్కృతిక సదస్సు నిర్వహిస్తున్నారు.
ఎక్కువగా శ్రీకాకుళం , విజయనగరం జిల్లా తెలుగువారే ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో ఉంటున్నారు . రాష్ట్ర విభజనలో్ చోటుచేసుకున్న అక్రమాలు, పెద్దల పట్టుదల కారణంగా ఒడిశా ప్రాంతాల్లోకి మారిపోయిన తెలుగువారు పాట్లు పడుతున్నారు.

దేశవ్యాప్తంగా భాషా అల్పసంఖ్యాక మైనారిటీల విషయంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుండగా ఒడిశాలోని తెలుగువారికి మాత్రం  అన్యాయం జరుగుతోంది. అదే సమయంలో ఆంధ్రాలోని ఒడియా వారికి అన్ని సౌకర్యాలు ఇరురాష్ట్రాల నుంచి చేరుతున్నాయి. తెలుగుభాషపై మమకారం, బంధువుల్లో చిన్నచూపు ఉండకూడదని చదువు కోసం వ్యయప్రయాసలు పడుతున్నారు.

ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలు
గత ఏడాది ఒడిశా బరంపురంలో నిర్వహించిన అఖిల భారత తెలుగు మహాసభల్లో ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహా అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. పర్లాకిమిడి, చికిటిలలో తెలుగు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నానాటికి ఒడిశాలోని తెలుగువిద్య దూరమవుతోంది. తెలుగు పాఠశాలలు ఒడియా పాఠశాలలుగా మార్పు చేస్తున్నారు. తెలుగు ఉపాధ్యాయుల స్థానే ఒడియా వారిని నియమిస్తున్నారు. చేసేది లేక ఒడిశాలోని తెలుగువారు ఆంధ్రాలో ఉన్న బంధువుల చిరునామాతో ఇక్కడ చదువులు సాగిస్తున్నారు. ఈ ఏడాది తిరుపతిలో జరుగబోయే ప్రపంచ తెలుగు మహాసభల్లో అయినా తమకు న్యాయం జరగాలని ఒడిశా తెలుగువారు కోరుతున్నారు. శనివారం బరంపురంలో జరిగే ఆంధ్రాభాషాభివర్థినీ సభ్యులు, తెలుగుభాషాభివృద్ధి సంఘ అధ్యక్షుడు, ఇతర అధికారులు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అయినా ఒడిశా తెలుగువారి కష్టాలను ఆంధ్రా ప్రభుత్వం పట్టించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
  • * తెలుగు చదువుకోవాలంటే కనీసం 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఇచ్ఛాపురం సమీపంలోని సవరదేవిపేట, జయంతిపురం, నౌగాం, జరడా, పాత్రపురం, గిరసోల, పితాతొళి, చికిటిపేట, సుమండి, సర్ధాపురం, భీమ్‌పురం తదితర ప్రాంతాల  తెలుగువారు ఇచ్ఛాపురం మండలానికి వచ్చి చదువుకుంటున్నారు.
  • * అందుకు నదిలో ఈదుకుంటూ కొందరు, మూడు బస్సులు మారి మరికొందరు, సైకిళ్లపై ఇంకొందరు రాకపోకలు సాగిస్తున్నారు.
  • * ఉదయాన్నే భోజనం తెచ్చుకుంటూ రాత్రి చీకటి పడిన తరువాత ఇంటికి చేరుకుంటున్న తెలుగు అభిమానుల వేదన అంతా ఇంతా కాదు.
  • * ఇచ్ఛాపురం ప్రాంతంలోనే కాదు సరిహద్దు మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల విభజనలో నేతల పట్టుదల కారణంగా తెలుగువారు ఉండే గ్రామాలు కూడా ఒడిశాలోకి వెళ్లిపోయాయి.
* ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజవర్గాలలో చాలా గ్రామాలు ఇరు రాష్ట్రాల పరిధిలోనూ కనిపిస్తుంటాయి.
  • * శ్రీకాకుళం జిల్లా  పాఠశాలలు, కళాశాలల్లో ఒడిశాలోని తెలుగువారు  అధికంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు సైతం గుర్తించినా, ప్రభుత్వ పరంగా ఒడిశాపై ఏ ఒత్తిడిని చేయకపోవడం వల్ల నానాటికి ఒరిస్సా ప్రాంతం విద్యాలయాల్లో తెలుగు కనుమరుగు చేస్తున్నారు.

తెలుగే ఎందుకు చదవాలి?
ఒడిశాలో ఉన్న వారు అందుబాటులో ఉన్న ఒడియా, హిందీ భాషలను కాదని, వ్యయప్రయాసలు పడి తెలుగు ఎందుకు చదవాలనే ప్రశ్న ఉంది. దీనికి ఆయా ప్రాంతాలలో ఉన్న తెలుగువారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ఇరు రాష్ట్రాలలోనూ ఉన్నారు. అందరూ తెలుగువారు అయినపుడు తెలుగువారితోనే పెళ్లి సంబంధాలు కలుపుతుంటారు. అలా ఒడియా చదివినా, తెలుగు రాకున్నా పెళ్లిళ్లు కావడం లేదని వారి ఆవేదన. తాత ముత్తాతల నుంచి వస్తున్న తెలుగు సంప్రదాయాలను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఒడిశాలోని తెలుగువారి గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని వారి ఆవేదన.

* ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఒడియా వారి కోసం ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో 'ఉత్కళ్‌ సమ్మేళన్‌ సమితి' ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవు.
* భాషాభివృద్ధి కోసం 1986లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆంధ్రాలోని ఒడియా పాఠశాలల పర్యవేక్షణకు ఒడియా డి.ఐ., ఒడిశాలోని తెలుగు పాఠశాలల పర్యవేక్షణకు తెలుగు డి.ఐ. పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒడియా డి.ఐ. పోస్టు అమలు చేస్తున్నారు.. ఒడిశాలో తెలుగు డి.ఐ. నియామకం చేపట్టలేదు. అక్కడ తెలుగు పాఠశాలలు క్రమేపి ఒడియా పాఠశాలలుగా మారిపోతున్నాయి.
* ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఒడియా విద్యార్థులు ఒడిశాలో బి.ఇ.డి., సి.టి., ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు చేసేందుకు 'విచ్ఛనాంచల్‌ కోటా' పేరిట 5 శాతం అనుమతిస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాలలోని తెలుగువారికి ఆంధ్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించలేదు.


 తెలుగులో చదువుకునేందుకు ఇబ్బంది పడి, కొంతవరకే  అందుబాటులో (ఇచ్ఛాపురంలో) డిగ్రీవరకు చదువుకునే అవకాశం ఉన్నది , ఇలా దగ్గరగా ఉన్న ఒడియా గ్రామాలకే అవకాశం లభిస్తోంది.  తిరుపతిలో ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభలలో అయినా ఒడిశాలోనూ తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరాలి . ఒడిశాలోని తెలుగుకోసం యోచిస్తారని ఆశిస్తున్నాను . భౌగోళిక విభజన తోనే అన్యాయానికి గురయ్యారు . ఇప్పటికైనా రాష్ట్ర సరిహద్దులు దగ్గరగా ఉన్న ఒడిశా గ్రామాలలో తెలుగు పాఠశాలలు పెట్టి  తెలుగువారికి న్యాయంచేయాలని కోరుకుందాము . ఆంధ్రాలో ఒడియాలకు లభించే  ఆదరణ ఒరిస్సా లో ఆంధ్రావారికి లభించాలని కోరుకుందాము .

--ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే వారి సౌజన్యము తో.
  • =======================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !