Monday, October 1, 2012

Sea pollution in Srikakulam-శ్రీకాకుళం కడలిలో కాలుష్యము .

  •  


శ్రీకాకుళం జిల్లా జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. సువిశాలమైన తీరం.. అందులో అపార మత్స్య సంపద.. ఖరీదైన భూగర్భ ఖనిజాలు.. గలగలపారే నదులు.. కనుచూపు మేర పచ్చదనం.. విశిష్టమైన చిత్తడి నేలలు... విభిన్న జీవరాశులు.. అన్నిరకాల పాడిపంటలు..

జిల్లాలో తీర ప్రాంత పొడవు 193 కిలోమీటర్లు. సోంపేట, కాకరాపల్లి సహా మరో ఐదు చోట్ల సముద్రం నీరు ఆధారంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ప్రజా ఉద్యమాల నేపథ్యంలో ఇవి తాత్కాలికంగా ఆగినప్పటికీ సర్కారు.. జిల్లా యంత్రాంగం మాత్రం ఎలాగైనా ఏర్పాటు చేసి తీరాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వివిధ రసాయన, ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలోని మత్స్యసంపద కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేసిన మేథావుల నుంచి సామాన్య జనం వరకూ అందరూ విధ్వంసకర పరిశ్రమలను వద్దంటున్నారు.

థర్మల్‌తో ముప్పు ఎలా అంటే...
* కిలో బొగ్గును కాలిస్తే మెర్క్యూరీ (0.50%), లెడ్‌ (207.0%), జింక్‌ (109.0%), కాడ్మియం (0.1%), క్రోమియం (75.0%)తోపాటు కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డైయాక్సైడ్‌, సల్ఫర్‌, నైట్రిక్‌, నైట్రస్‌ సంబంధిత భార లోహాలు, వాయువులు విడుదలవుతాయి.
* ఒక మెగావాట్‌ విద్యుత్తు తయారీకి 700 కిలోల బొగ్గును కాల్చాలి. ఇందులోంచి 40 శాతం వరకు బూడిద వస్తుంది.
* ప్రస్తుతం థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదను కూడా సముద్రంలోకే పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్న భారలోహాలను సముద్ర జీవులు తినడం, వాటిని మనుషులు ఆహారంగా తీసుకోవటం వల్ల కొత్త రోగాలు కొనితెచ్చుకునే ప్రమాదకరపరిస్థితి. ఈ పరిస్థితి వల్లనే పరవాడలో వందలాదిమంది మంచం పట్టారు.
* బూడిదలో ఉన్న మెర్క్యురీ అత్యంత ప్రమాదకరమైంది. 25 మిల్లీ గ్రాముల మెర్క్యురీ 25 ఎకరాల భూమిని కలుషితం చేస్తుంది. దీన్ని చేపలు ఆహారంగా తీసుకోవటం.. వాటిని మనుషులు తినడం.. దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతోంది. దీని ప్రభావం చిన్నపిల్లలు, గర్భిణీలపై ఎక్కువగా ఉంటోంది. నరాల సంబంధమైనవాటితోపాటు క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి.

వేడినీటితో కూడా ముప్పే..
* సముద్రపు నీరు ఆధారంగా ఏర్పాటు చేసే థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌ స్థాయిలో వేడి నీటిని తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతున్నారని ఇది చాలా ప్రమాదకరమని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
* సాధారణంగా థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు అనుమతులు తెచ్చుకునే సమయంలోనే యాజమాన్యాలు 7 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి నీటిని సముద్రంలోకి వదులుతామని చెబుతున్నాయి. వాస్తవం వేరుగా ఉంటోంది. వంద డిగ్రీల సెల్సియస్‌కు పైబడి వేడిగా ఉన్న నీటిని తిరిగి చల్లబర్చే పరిస్థితి సాధారణంగా ఎక్కడా అమలు చేయటం లేదు. దీంతో సముద్రంలోకి వదిలే నీటి వేడి 12 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉంటోందని నిపుణులు గుర్తించారు. దీనివల్ల సముద్రజీవులకు ప్రధానాధారమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతుంది. ఫలితం.. సముద్ర సంపద నాశనమవుతుంది.

* సముద్రం నుంచి నీటిని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లే రెండు మీటర్ల వ్యాసార్థంగల గొట్టాల ద్వారా చేపలు, గుడ్లు, ఇతర సంపద లోపలికి వెళ్లి నాశనమైపోతున్నాయి. అందుకే థర్మల్‌ కేంద్రాల్లో సముద్రనీటి వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని నిపుణులతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు హెచ్చరించాయి.
* సముద్రంలోకి వేడినీరు వదలటం ద్వారా వాటిల్లే ముప్పు అంతాఇంతా కాదు. దీనివల్ల ఆ ప్రాంతమంతా ప్రత్యేక జోన్‌గా మారుతుంది. వేడినీటితోపాటు నత్రజని, భాస్వరం, ఇతర భారలోహాలు సముద్రంలో చేరడంతో ఆల్గేలు (శైవలాలు) కలుషితమైపోతున్నాయి. ఇది విపరీతంగా పెరిగిపోయి.. సముద్రంలోని మిగిలిన జీవుల జీవనానికి పెద్ద ఆటంకంగా మారిపోతోంది.
* సాధారణంగా సముద్ర జలాల్లోకి ఒకటి నుంచి రెండు డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడినీటిని వదిలితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆ స్థాయి దాటితే సముద్రంలో ప్రాణవాయువు శాతం తగ్గిపోతుంది. తద్వారా జీవులు నాశనమవుతున్నాయి.
* ప్రయివేటు సంస్థల మాట అటుంచి.. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పరవాడ లాంటి చోట్లే సముద్ర సంపద పూర్తిగా నాశనమైపోయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

బూడిదతో ప్రమాదమం..
* బొగ్గు కాల్పడం ద్వారా వచ్చే బూడిదతో ఎంతో ప్రమాదం పొంచి ఉంది.
* సోంపేటలాంటి చోట్ల అనుమతిచ్చిన విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ గంటకు 16 టన్నుల బొగ్గును కాల్చాల్సి ఉంటుంది. అందులోంచి వచ్చే 40 శాతం బూడిదను నింపేందుకు ఎన్ని ఎకరాల చెరువులు అవసరమో అంచనా వేయాల్సి ఉంది.
* టాటా ఎనర్జీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక ప్రకారం ఒక మెగావాట్‌విద్యుదుత్పత్తి కోసం వినియోగించిన బొగ్గులోంచి వచ్చిన బూడిదను పూడ్చడానికి ఎకరా భూమి కేటాయించాల్సి ఉంటుంది. పైగా బూడిదను సకాలంలో తరలించాలి.
* పరవాడ, ఇతర పరిశ్రమలను పరిశీలిస్తే బూడిదలో కనీసం 30 శాతమైనా బయటకు తరలించే పరిస్థితి లేదు. అందుకే సముద్రంలోకి తరలించేస్తున్నారు.
* శ్రీకాకుళం జిల్లాలో అనుమతులిచ్చిన 12 వేల మెగావాట్ల స్థాయిలో బొగ్గును కాలిస్తే వచ్చే బూడిదతో జిల్లా అంతా బూడిద కుప్పగా మారిపోతుందనే భావించాలి .

జీవరాశులు నాశనం
థర్మల్‌ విద్యుత్కేంద్రాల వల్ల కోట్లాది జీవరాశులు నాశనమవుతున్న విషయం అధ్యయనాల ద్వారా స్పష్టమైంది. వన్స్‌త్రో కూలింగ్‌ సిస్టం ద్వారా చల్లనినీటిని పైపుల ద్వారా ఫ్యాక్టరీలోకి తరలిస్తున్నారు. దీంతో కొన్ని కోట్ల చేపపిల్లలు, గుడ్లు అందులోకి ప్రవేశించి వేడికి మరణిస్తున్నాయి. నీటిని తీసుకెళ్లే ప్రాంతం వద్ద ఏర్పాటు చేస్తున్న యంత్ర పరికరాల ద్వారా ఎంతో సంపద నాశనమవుతోంది. జాలీలు లాంటివి ఏర్పాటు చేసినా ఫలితం కనిపించటం లేదు. వేడినీటిని సముద్రంలోకి వదులుతున్నందునా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల బూడిదను కూడా సముద్రంలో వదిలేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. సముద్ర జలాలను థర్మల్‌ విద్యుత్కేంద్రాల కోసం వినియోగించవద్దని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నా
- కె.బాబూరావు, విశ్రాంత రసాయన శాస్త్రవేత్త, హైదరాబాద్‌

అన్ని విధాలుగా నష్టం
బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాల వల్ల అన్నివిధాలుగానూ మనిషికి నష్టమే. దీని కాలుష్యం స్లో పాయిజన్‌ మాదిరిగా మనిషిని తినేసే ప్రమాదం ఉంది. నరాల ప్రభావిత వ్యాధులతోపాటు క్యాన్సర్‌, గుండె, మెదడు సంబంధిత వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. పరవాడ లాంటి ప్రాంతాలను పరిశీలించగా పిల్లల్లో ఎదుగుదల పూర్తిగా ఆగిపోయిన కేసులు కనిపించాయి.
- డాక్టర్‌ వై.కృష్ణమూర్తి, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ సంఘం


సాగరం... అంతులేని అద్భుత ప్రపంచం. కోటానుకోట్ల జీవరాశులకు ఆలవాలం.. మనిషి మనుగడకు కీలకమైన ఆధారం. సాగరంలో జీవ వైవిధ్యం దెబ్బతింటే.. మొట్టమొదట ప్రభావితమయ్యేది మనిషే. అదెలాగో చూద్దాం...
* బంగాళాఖాతంలో లవణీయత గాఢత 35 నుంచి 37 శాతం; నత్రజని శాతం 4 నుంచి 7 శాతం ఉంటాయి. సముద్ర ఉష్ణోగ్రత 25 నుంచి 32 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఇది అసంఖ్యాక జీవరాశులు.. శైవలాలకు అనుకూలమైన వాతావరణం.  బంగాళాఖాతంలో శైవలాలు (బ్లూగ్రీన్‌ ఎల్గే) ఎక్కువ. తీరం నుంచి 4 నాటికల్‌ మైళ్ల వరకు ఒక రకమైన జీవరాశులు, 4 నుంచి 40 నాటికల్‌ మైళ్ల  వరకు మరోవిధమైన జీవరాశులు జీవిస్తున్నాయి.

* పరిశ్రమల నుంచి వెలువడుతున్న అత్యంత ప్రమాదకరమైన రసాయనాల కారణంగా జీవరాశుల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. ఆర్గానో క్లోరైడ్స్‌, ఆర్గానో పాస్ఫేట్స్‌, ఆర్గానో కార్బొనేట్స్‌ వంటి వ్యర్థ పదార్ధాలు సముద్రంలో కలుస్తున్నాయి. దీనివల్ల ఆక్సిజన్‌ (ప్రాణవాయువు) శాతం తగ్గి కార్బొనేట్స్‌ శాతం పెరుగుతోంది. ఫలితం.. మత్స్యసంపద నశిస్తోంది.  జీవావరణ విధానమైన సూక్ష్మజీవులు, వాటిని ఆహారంగా చేసుకుని జీవించే చిన్నచేపలు, వీటిని ఆధారంగా చేసుకుని జీవించే పెద్దచేపలు అంటే.. జీవవలయం దెబ్బతింటోంది. కలుషిత నీటిలోని చేపలను తినటం వల్ల మనిషి ఆరోగ్యమూ   దెబ్బతింటోంది.

తీరప్రాంతంలో జీవరాశులు
* శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు సాగరంలో ఎన్నో అరుదైన జీవరాశులున్నాయి. తీర నుంచి నాలుగో నాటికల్‌మైలు వరకు లభిస్తున్న వాటినే మన జిల్లాలో ఆహారంగా వినియోగిస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసేచోటుకు, వంశధార నది సముద్రంలో కలిసే చోటుకు హిల్సాఇల్లిసా (పొలస జాతి చేపలు) వలస వస్తుంటాయి. ఇవి నీటికి ఎదురీదుతాయి. సముద్రం నుంచి తీయటి నీటిలోకి ఎదురీది ప్రత్యుత్పత్తి సాగించి.. తిరిగి తమ ప్రాంతాలకు  వెళ్తుంటాయి.  జిల్లాలోని తీరప్రాంతంలో కానాగర్తలు (రాష్ట్రజర్‌ కానాగర్త), సావడ (ట్రైకోరస్‌ సవల), సొరచేప (స్కోలియోడన్‌), గ్రేముల్లెట్‌ (ముగిల్‌ సిప్లస్‌), పొలస (హిల్సాఇల్లిస), కలవ (సార్డినెల్లా), వంజరం (షీర్‌ఫిష్‌), చందువ (స్ట్రోమటెవ్స్‌), పాలబొంత (చానస్‌ చానస్‌), బల్లపరుపుచేప (మైలోబేటస్‌), విద్యుత్తుచేప (నార్సిన్‌ ఎలక్ట్రిక్‌ రే), పులిసొర (స్టెగోస్టొమా) వంటి చేపలతోపాటు పీతలు, రొయ్యలు, మలస్కా వంటి సముద్ర ఆధారిత జీవులు, ఆలివ్‌రిడ్‌ తాబేళ్లు ఒకపుడు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ఇందులో వంజరాలు, సందువ, కలవ, టూనా చేపలు దాదాపుగా తగ్గిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి చేపలను ఇక్కడకు దిగుమతి చేసుకుని  విక్రయిస్తున్నారు.  డాల్ఫిన్‌ వంటి క్షీరదాలు, పులిసొరలు రాత్రివేళల్లో నాలుగు నాటికల్‌మైళ్ల వరకు ఆహారం కోసం వస్తున్నాయి.

ఆహారంపై ప్రభావం
సాగరంలోని చేపలకు అడుగు భాగాన ఏర్పడే శైవలాలు (బ్లూగ్రీన్‌ ఆల్గే), ప్లవర జీవులే ఆహారం. ప్రస్తుతం విశాఖపట్నం షిప్‌యార్డు వద్ద వెలువడుతున్న రసాయనాలు, క్రూడాయిల్‌, రణస్థలం మండలం పైడిభీమవరం పారిశ్రామికవాడ వ్యర్థాలు సముద్రంలో కలిసి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. శైవలాలు, ప్లవరజీవులు కలుషిత వాతావరణంలో పూర్తిగా నాశనమౌతున్నాయి.  నీటిలో కలుస్తున్న ఆర్గానో క్లోరైడ్స్‌ మానవజీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతోందని నిపుణులు  ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మూత్రపిండాల వ్యాధులకూ ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు.

మత్స్యసంపద మనుగడకు ప్రమాదమే
పారిశ్రామిక వ్యర్థాల వల్ల తీరం మొత్తం కలుషితమౌతోంది. ఇప్పటికే ఎన్నోరకాల మత్స్యసంపద నాశనమైపోయింది. నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడం.. ఉష్ణోగ్రత పెరగడం వల్ల జీవుల మనుగడ కష్టమౌతోంది. కలుషిత నీటిలో పెరిగిన చేపలను తినడం ద్వారా మనిషి జబ్బులపాలవుతున్నాడు.
- ఎన్‌.హెచ్‌.కె. జనార్దనరావు, జువాలజీ అధ్యాపకుడు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, టెక్కలి.

వ్యర్థాలతో అనర్థాలు
* రసాయన పరిశ్రమల నుంచి మూడురకాల వ్యర్థాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఘన, వాయు, జల వ్యర్థాలు.  వీటిలో సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డైఆక్సైడ్‌, ఓల్టాన్‌, ఆర్గాన్‌, కార్బాన్‌ వంటి విషపూరిత వాయువులుంటాయి. వీటి మోతాదు మించితే వాతావరణం కలుషితమవుతుంది.

* పరిశ్రమల నుంచి విడుదల చేసే లీటరు నీటిలో సీవోడీ (కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) 250 మిల్లీగ్రాములు ఉంటేనే సముద్రంలోకి విడిచి పెట్టడానికి అనుమతిస్తారు. టి.డి.యస్‌ (టోటల్‌ డిసోల్వడ్‌ సోలిడ్‌) ఒక లీటరులో 15 నుంచి 20 వేల మిల్లీగ్రాములు ఉంటేనే సముద్రంలోకి విడిచిపెట్టాలి.

* పారిశ్రామిక వ్యర్థాల పరిశీలనకు 2010 అక్టోబరులో మెరైన్‌ పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేశామని ఇది వ్యర్థజలాలను పరీక్షించిన తర్వాతే విడిచిపెడుతోందని కాలుష్య నియంత్రణ కార్యనిర్వాహక ఇంజినీరు లక్ష్మీనారాయణ చెప్పారు. వ్యర్థాల ట్యాంకులు నిండిన తరువాత వెళ్లి పరిశీలిస్తున్నామని, నిర్ణీత ప్రమాణాల్లో లేకపోతే మళ్లీ వాటిని శుద్ధి చేయిస్తున్నామన్నారు.

పరిశ్రమలు విడుస్తున్న వ్యర్థాలు
  • అరబిందో--10,360 లీటర్లు ,
  • ఆంధ్రా ఆర్గానిక్స్‌--2500 లీటర్లు .
  • లాన్‌టెక్‌--440 లీటర్లు ,
  • మ్యాట్రిక్స్‌ (పూసపాటి రేగ మండలం) 4600 లీటర్లు ,

Courtesy with : న్యూస్‌టుడే - సోంపేట, టెక్కలి/టెక్కలి పట్టణం,రణస్థలం (30-09-2012).

  • =======================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !