Tuesday, September 25, 2012

Waste and illhealth in Srikakulam dist.-శ్రీకాకుళం జిల్లాలో చెత్త వలన అనర్ధాలు





చెత్తకుప్పలో పదివేల బ్యాక్టీరియా రకాలున్నాయి. ఇది పురపాలకశాఖ అధికారులు చెబుతున్న మాట.చెత్తే కదాని తేలిగ్గా తీసేస్తే.. మనల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తుంది.
జిల్లాలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే. ఏటా వర్షాకాలంలో వందలాదిమంది జనం విషజ్వరాలు, డెంగీ, గన్యా, మలేరియా బారినపడి చనిపోతున్నారు. ఇంకెన్నో రుగ్మతలతో ఆసుపత్రులపాలవుతున్నారు. వీటికి కారణాల్లో అత్యంత కీలకమైన అంశం చెత్త.

జిల్లా కేంద్రం, పురపాలకసంఘాలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల గ్రామాలు సహా అన్నిచోట్లా అపరిశుభ్ర వాతావరణమే. బహిరంగ మలవిసర్జన లేని గ్రామం జిల్లాలో లేదు. కొన్ని గ్రామాల్లోకైతే కనీసం అడుగువేయలేనంత చెత్త పేరుకుపోతోంది. ముక్కుపుటాలదిరే దుర్వాసన మధ్యే వేలాదిమంది జనం జీవనం సాగిస్తున్నారు. గాలి, నీరు, పరిసరాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. క్రిమికీటకాలు, వ్యాధికారక సూక్ష్మక్రిములు జనంపై దాడి చేస్తున్నాయి. ఫలితమే వందలాది మరణాలు. ఈ రెండు నెలల కాలంలోనే వెలుగులోకి వచ్చిన మరణాలు 71. వేలసంఖ్యలో జనం ఆసుపత్రులపాలయ్యారు.


సర్కారీ వ్యవస్థ నిర్లిప్తత.. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవటం.. సామాజిక బాధ్యతను తీసుకోకపోవటం వల్లనే జిల్లా పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. చెత్త ఎంత ప్రమాదకరంగా మారిందో... పరిశీలిద్దాం.. ఇకనుంచైనా మన ఇల్లు.. మన వీధి.. మన గ్రామం.. మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం...


స్రీకాకుళం జిల్లాలో నిత్యం వందలాది టన్నుల చెత్త పేరుకుపోతోంది. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం నూటికి నూరుశాతం ఉన్నా.. పౌరస్పృహ కూడా లేకపోవటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు చెత్తకుప్పలని తీసేసి బుగ్గి చేసే యంత్ర సామగ్రి అందుబాటులో లేదు. దీంతో అది ఎండకు ఎండి, వానకు తడిసి, కుళ్లిపోతోంది. అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా క్రిములు వివిధ మార్గాల ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. చెత్తకుప్పల నుంచి ఎగసిపడే ధూళి రేణువుల ద్వారా శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. గుండె, మూత్రపిండం, చెవి, ముక్కు, గొంతు, చర్మం ఇలా వివిధ భాగాల్లోకి క్రిములు చేరి రోగాలకు కారణమవుతున్నాయి.

  • చెత్తలో 87 శాతం మిథేన్‌ వాయువే
కుళ్లిన చెత్తలో 87 శాతం మిథేన్‌ వాయువే ఉంటుంది. మిగిలింది బొగ్గుపులుసు (కార్బన్‌డైయాక్సైడ్‌) వాయువు. మిథేన్‌ వాయువును నేరుగా పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయని  నిపుణులు చెబుతున్నారు. మిథేన్‌, కార్బన్‌డైయాక్సైడ్‌ పీల్చడం వల్ల కళ్ల మంటలు, తలనొప్పి, దగ్గు, ఆస్త్మా తదితర వ్యాధులు సోకుతాయి.

చెత్త ద్వారా ఉత్పత్తయ్యే దోమలు, బ్యాక్టీరియా వల్ల మనిషికి సంక్రమించే వ్యాధులు :
  • * మెదడు: శరీరంపై ఆడ అనాఫిలస్‌ దోమ కుట్టడం ద్వారా జ్వరం సోకి తీవ్రంగా మారి మెదడుపై ప్రభావం చూపి మృతి చెందేందుకు దారితీస్తుంది.
  • * నోరు: గాలిలోని క్రిములను పీల్చడం వల్ల నోటిలో అల్సర్లు, డయేరియా, వాంతులు విరోచనాలకు కారణమవుతాయి.
  • * గొంతు: న్యూమోకాకస్‌ క్రిముల కారణంగా గొంతు వాపు, అల్సర్లు వస్తాయి. మాట్లాడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
  • * ఊపిరితిత్తులు: మాంగియోకాకస్‌ క్రిముల కారణంగా ఊపిరితిత్తుల్లో అడ్డంకులు ఏర్పడి శ్వాసకు ఇబ్బంది. ఫలితం ఆయాసం.
  • * గుండె: స్టెప్టోకాకస్‌ క్రిములు గుండె కవాటంపై ప్రభావం చూపుతాయి. రక్తప్రసరణలో ఇబ్బంది కలిగిస్తాయి. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
  • * చిన్న, పెద్దపేగులు: షిగెల్లా క్రిములు చిన్న, పెద్దపేగుల గోడల్లో అల్సర్లకు కారణమవుతాయి. పేగులు చిట్లడం ద్వారా రక్త విరోచనాలు, వాంతులు అవుతాయి.
  • * కడుపు: అమీబియాసిస్‌ క్రిమి చిన్న పెద్ద పేగులపై ప్రభావం చూపుతుంది. కడుపునొప్పి, ఉబ్బరంగా ఉండటం, విరోచనాలకు కారణం అవుతాయి.
  • * కాలేయం: వైరల్‌ హెపటైటిస్‌ ఎ, ఇ - క్రిముల కారణంగా పచ్చకామెర్లు .
  • * మూత్రపిండం: ఆడ అనాఫిలస్‌ దోమ కుట్టడం ద్వారా క్రిములు మనిషి శరీరంలోకి వ్యాపించి రక్త కణాలను ధ్వంసం చేస్తాయి. రక్తం నల్లగా మారి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మూత్రపిండాలు చెడిపోయి ప్రాణాలమీదకు వస్తుంది.
  • * కాళ్లు: ఆడ క్యూలెక్స్‌ దోమ కుట్టడం వల్ల ఉచిరేరియా బాన్‌క్రాఫ్టీ అనే పరాన్నజీవి బోదకాలు వ్యాధి సోకేలా చేస్తుంది.
చెత్తలోని కీలక బ్యాక్టీరియా.. వాటివల్ల వచ్చే అనర్థాలు..
  • ఇశ్చరీషియా కోలి(ఈ.కొలి)--ఇది చెత్తలో ఉత్పత్తయ్యే ప్రమాదకారి. గాలి, నీటిలో జీవనం. ఈగలు, దోమల ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది వాంతులు, విరోచనాలకు కారకమవుతుంది.
  • ప్రోటీయస్‌ క్రిమి: దీనివల్ల మూత్రసంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. కొన్ని సందర్భాల్లో మూత్రనాళాలు సెఫ్టిక్‌ అయ్యే ప్రమాదం ఉంది.
  • సాల్మొనెల్లా టైఫీ--ఇది టైఫాయిడ్‌ జ్వరానికి కారణమవుతుంది.
  • ఎసైనా ఎంట్రోకొలైటికా--గ్యాస్ట్రో ఎంటరైటిస్‌ వ్యాధికి కారకం. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, విరోచనాలు, వాంతులు. పెద్దపేగులపై ప్రభావం చూపుతుంది.
  • స్టెఫైలోకాకస్‌ ఆరియస్‌: చర్మవ్యాధులకు కారణమవుతుంది. గాయాలపై ఈ క్రిమి సోకితే అది మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. గొంతు, చెవి సంబంధ వ్యాధులు సోకుతాయి.
  • స్ట్రెప్టో కాకస్‌: ఈ బాక్టీయా గుండె, మూత్రపిండం, గుండె కవాటాలపై ప్రభావం చూపుతుంది. కోలుకోకపోతే ప్రాణంమీదికి వస్తుంది. గొంతులో నొప్పి, శరీరంపై అలర్జీ కలుగుతుంది.
  • సూడోమోనాస్‌ ఆరిగోనోసా: పిల్లల్లో విరోచనాలు, వాంతులకు ఈ క్రిమే కారణం. ఏడాదిలోపు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చెవి సంబంధ వ్యాధులకు కూడా కారణమిదే.
  • లిస్టిరియా: మహిళల్లో ఈ క్రిమలు సంతానలేమిని కలిగిస్తాయి. గర్భస్రావానికి కారణమవుతాయి.
  • ఆస్పిర్జిల్లస్‌, క్యాండిడా (ఫంగస్‌): ఈ ఫంగస్‌ల వల్ల గర్భిణీల్లో మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చర్మవ్యాధులు, గోళ్ల సంబంధ వ్యాధులు వస్తాయి.

సలహాలు :
శరీర వ్యవస్థను బ్యాక్టీరియా నిర్వీర్యం చేస్తుంది.చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయకపోతే దోమలు, క్రిములు ఉత్పత్తవుతాయి. వీటి ద్వారా ప్రమాదకరమైన క్రిములు మనిషి శరీరంలోకి ప్రవేశించి కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తాయి. గాలి ద్వారా పీల్చడం, నోటిద్వారా, కుట్టడం ద్వారా ఇవి శరీరంలో ప్రవేశిస్తాయి. గాలిలోని ధూళికణాలను పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు, నోటి ద్వారా అల్సర్లు ఇతర వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దోమల సంగతి తెలిసిందే. కుళ్లిన చెత్త నీటిలో కలిసి.. కాల్వల్లోకి చేరి.. గొట్టాల లీకేజిల్లో ఇది కలిస్తే వ్యాధులు రావటం ఖాయం. రక్షిత మంచినీటిని తాగడం ద్వారా చాలావరకు వ్యాధుల నుంచి కాపాడుకోగలం.


చెత్తను నిర్వీర్యం చేయకుంటే ముప్పే-పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసి బుగ్గి చేసేయాలి. లేదంటే మనకు ముప్పు తప్పదు. చెత్తను బుగ్గి చేసే యంత్రాలను వినియోగిస్తే కొంత వరకు వ్యాధులను అరికట్టవచ్చు. పురపాలక, పంచాయతీ అధికారులు వీటిపై దృష్టి పెట్టాలి. విదేశాల్లో చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే విధానం ఉంది. దీన్ని దత్తత చేసుకోవడం ద్వారా మనమూ ప్రయోజనం పొందవచ్చు.


ధూళితో శ్వాసకోశ వ్యాధులు--చెత్తలోని క్రిములు ధూళితో కలిసిపోతాయి. వాటిని పీలిస్తే శ్వాసకోస సంబంధ వ్యాధులు సోకుతాయి. చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుండా పొడి, తడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య పనివారికి అప్పగించాలి. పురపాలక, పంచాయతీ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !