Tuesday, January 31, 2012

శ్రీకాకుళం లో ఆలీవ్‌రిడ్లే తాబేళ్లు,Olive ridley seaturtles in Srikakulam


  • image : courtesy with Eenadu news paper.




ఆలీవ్‌రిడ్లే తాబేళ్లు.. సముద్రంలోని చేపలకు హాని కలిగించే విషకర నీటికాయలు (జల్లీఫిష్‌) తిని మత్స్య సంపద పెరుగుదలకు ఉపకరించేవి.. ఈ తాబేళ్లు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ తీరానికి చేరుకొని ఇసుకతిన్నెల్లో గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి.. ఈ గుడ్లకు రక్షణ కరవయ్యింది.. కుక్కలు, నక్కలు వీటిని పీక్కుతింటుండడంతో అరుదైన సముద్ర తాబేళ్లు అంతరించిపోతున్నాయి. వీటి రక్షణకు ఒడిశాలోని అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 196 కిలోమీటర్ల సముద్రతీరముండే సిక్కోలులో వీటి రక్షణకు అటవీశాఖ అధికారులు అరకొర చర్యలు మొదలెట్టారు.. ఈ విలువైన సంపదను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మత్స్యకారులు తెలిపారు. జిల్లాలో ఈ ఆలివ్‌రిడ్‌ తాబేళ్ల సంతతి, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక కథనం..


అంతరించిపోతున్న జాతులకింద గుర్తించిన వాటిలో ఆలీవ్‌రిడ్లే సముద్ర తాబేళ్లున్నాయి. ఈ అరుదైన జాతికి చెందిన వీటిని సంరక్షించడంలో అటు అటవీ, ఇటు మత్స్యశాఖలు తగు చర్యలు చేపట్టడంలేదు. ఇవి సముద్రంలో అధికంగా ఉంటే మత్స్య సంపద పెరగడమే గాకుండా వేటచేసేందుకు అనుకూలంగా ఉంటుందని మత్స్యకారుల అపార నమ్మకం. చేపలకు హాని కలిగించే విషకర నీటికాయలు (జల్లీఫిష్‌) జీవులను ఆహారంగా తినడంలో ఇవి దిట్ట అని మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. వేట చేస్తున్నపుడు కొన్ని సందర్భాల్లో నీటికాయలు వలలకు తగిలి వాటి పోగులు శరీరానికి తగిలితే మత్స్యకారులు నాలుగైదు రోజులు నరకయాతన అనుభవిస్తారు. తీవ్రమైన జ్వరం, శరీరమంతా నొప్పులై ఆసుపత్రి పాలవుతుంటారు. అలాంటి ప్రమాదకర జీవులను తినే శక్తి తాబేళ్లకే ఉంది.

ఇదీ పరిస్థితి
* జిల్లాలో 196 కిలోమీటర్ల విస్తీర్ణంలో 104 మత్స్యకార గ్రామాల పరిధిలో తీర ప్రాంతముంది.
* తాబేళ్లు ఎక్కువగా ఏటా జిల్లాలో వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, కవిటి, రణస్థలం, సంతబొమ్మాళి, కళింగపట్నం, కెవిపాలెం, డొంకూరు తీరప్రాంతాలకు వలస వస్తాయి.
* తీరానికి 100 నుంచి, 150 మీటర్ల దూరంలో ఇసుకలో మీటరులోతు తవ్వి గుడ్లు పెట్టి వెళ్తుంటాయి.
* ఒక్కొక్కటీ 80 నుంచి 140 వరకు గుడ్లు పెడతాయని జిల్లా అటవీ శాఖాధికారి మహమ్మద్‌ తయ్యబ్‌ చెప్పారు.
* ఆస్ట్రేలియా, హిందూ మహా సముద్రం, నైజీరియా, సైబీరియా వంటి సుదూర పాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ తీరానికి వచ్చి గుడ్లుపెట్టి వెళ్తుంటాయి.
* పలు రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో వీటిగుడ్లు పొదిగి.. పిల్లలను సంరక్షించి క్షేమంగా సముద్రంలోకి వదిలేంత వరకు తీరప్రాంతాల్లో సంరక్షణ కేంద్రాలు (హేచరీలు)ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితులు కానరావడంలేదు.
* ప్రపంచంలోనే ఇవి ఎక్కువగా ఒడిశాలోని గంజాం, గోపాల్‌పూర్‌, తదితర తీరప్రాంతాలకు వచ్చి గుడ్లు పెడుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఒడిశాలోని వీటి సంరక్షణకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
అంతరించిపోతున్న తీరిది..
* ఆలీవ్‌రిడ్లే తాబేళ్లు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ తీరానికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్తుంటాయని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఇవి గుడ్లు పెట్టడాన్ని నక్కలు, కుక్కలు గమనించి వాటిని తినేస్తున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* ఈ గుడ్లు తింటే మంచిదని కొందరు అదేపనిగా తీరంలో వీటిగుడ్లు సేకరించి అమ్ముకుంటున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టాలి.

* గుడ్లుపెట్టిన సుమారు 40 నుంచి 45 రోజుల్లో పొదిగి పిల్లలు తయారవుతాయి. అప్పటివరకు వీటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే వీటి అభివృద్ధి మరింత ఎక్కువగా ఉంటుంది.

* సముద్రంలో వేటకు టేకు వలలను అధికారులు నిషేధించారు. తాబేళ్లు వీటిబారిన పడి ఏటా వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. మత్స్యకారులు రాత్రివేళల్లో రహస్యంగా వీటితో వేట చేస్తున్నారు.

* ఏడాది క్రితం టేకు వలలు ఉపయోగించి వేట చేయడం వల్ల సుమారు 200లకు పైగా పెద్ద ఆలీవ్‌రిడ్లే తాబేళ్లు మృతిచెంది కొత్తపేట తీరానికి చేరిన విషయం తెలిసిందే.

* ఒకప్పుడు తాబేళ్లు మృతిచెందడం చాలా తక్కువని, ప్రస్తుతం అధునాతన బోట్లతో అనుమతులు లేని వలలుఉపయోగించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని, అధిధికారులు చేతులెల్తేస్తున్నారనే విమర్శలున్నాయి.

* వలలు వేటకు ఉపయోగించినపుడు వాటికి చిక్కిన తాబేళ్లు తిరిగి బయటకు వచ్చే మార్గం ఏర్పాటు చేయాలనే అదేశాలు పట్టించుకోవడంలేదు.

ఒడిశాలో రక్షణ ఇలా..
* సంతానోత్పత్తి కోసం సాగరతీరానికి చేరుకునే ఆలీవ్‌రిడ్లే తాబేళ్ల రాక ఒడిశావాసులు శుభసూచకంగా భావిస్తారు. ఒడిశాలోని దేవీనది, గహిర్‌మఠ్‌, రుషికుల్య ప్రాంతాల ముఖ ద్వారాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా కొస్తారికా, శ్రీలంక, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో జీవిస్తాయి.

* కేవలం సంతానోత్పత్తి కోసం తీరానికి చేరుతుంటాయి. ఇలా 75 శాతం తాబేళ్లు భారత్‌ తీరానికి వస్తాయి. అందులో కూడా 80 శాతం ఒడిశా తీరంలోని దేవీనది, గహిర్‌మఠ్‌, రుషికుల్య ముఖద్వారాల ప్రాంతానికి వస్తుంటాయి. ఈ తీరం మెత్తగా, బల్లపరుపుగా, విశాలంగా ఉండటం, ఒక డిగ్రీ సోప్‌ ఉండటం, ఈ తాబేళ్లకు ప్రధాన ఆహారమైన జెల్లి ఫిష్‌ విరివిగా లభించడం వల్ల వస్తుంటాయి.

* అవి గుడ్లు పెట్టే ప్రాంతంలో చేపల నిషేధిసనిషేధిస్తారు. అటవీశాఖ సిబ్బంది రక్షణగా ఉంటారు.

* ఏటా 2.10లక్షల గుడ్లు పెడుతున్న ఈ తాబేళ్లు గత ఏడాది రికార్డు స్థాయిలో 2.53 లక్షల గుడ్లు పెట్టాయి. ఈ ఏడాది రుషికుల్యా తీరం కొట్టుకుపోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది.

* ఈ పిల్లలు ఒకసారి సముద్రాన్ని తాకితే ఆ ప్రాంతాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాయి.

తీరానికి 100 మీటర్ల దూరాన ఒడ్డున ఇసుక తిన్నెల్లో తాబేళ్లు వందలాది గుడ్లు పెడుతున్నాయి. వాటిని సంరక్షిస్తే ఏటా వేలాది సంపద పెరుగుతుంది. సంరక్షణ కొరవడడంతో నక్కలు, కుక్కలు గుడ్లను తినేస్తున్నాయి. పొదిగేవరకు ఒక్క గుడ్డయినా మిగలడంలేదు. దీని వల్ల సంపద అంతరించిపోతున్నాయి.

చేపల ఉత్పత్తి పెరగడానికి తాబేళ్లు ఎంతగానో దోహద పడుతున్నాయి. చేపలకు హాని కలిగించే జీవులను ఇవి తినేస్తాయి.

నాలుగేళ్ల క్రితం వాతావరణంలోని మార్పులు కారణంగా అధిక సంఖ్యలోఈ రకం తాబేళ్లు అటు ఒడిశాలోని పారాదీప్‌ నుంచి ఇటు విశాఖపట్నం మధ్య సముద్రంలో చనిపోయి ఒడ్డుకు చేరేవి. ఇటీవల ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. పారాదీప్‌, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో మత్స్యకారులు ఎక్కువగా ఉపయోగించే సోనా బోట్లు కారణంగా ఈ తాబేళ్లు అందులో చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి. వీటి వల్ల సముద్రంలో జీవ సమతౌల్యం సాధ్యమవుతుందన్నారు.


ఒడిశాలోని వీటి సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యముంది. జిల్లాలో తాబేళ్లు పెడుతున్న గుడ్లను, పొదిగే పిల్లలను సంరక్షించే ఉద్దేశంతో గత ఏడాది రణస్థలంలో సంరక్షించే హేచరీ ఏర్పాటు చేశాం. ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వానికి దీని ప్రాధాన్యాన్ని తెలియపరచడంతో ఈ ఏడాది జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ అటవీరేంజ్‌ శాఖల పరిధిలో ఆరు హేచరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. గుడ్లు సేకరించి భద్రపరిచి వాటిని పొదిగించి తిరిగి పిల్లలు సముదం లోకి వెళ్లేంత వరకు హేచరిలో ఇద్దరిని చొప్పున నియమించాం. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ తీరంలో గుడ్ల సంరక్షణకేంద్రం ఏర్పాటు చేశాం.

- మహమ్మద్‌ తయ్యబ్‌, జిల్లా అటవీ శాఖాధికారి, శ్రీకాకుళం





  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !