నవ రుచుల తల్లి.. నౌపడా ఉప్పు గల్లి' అన్నది నానుడి. అందరికీ నవరుచులూ అందించే ఉప్పు రైతులకు మాత్ర అప్పులే మిగులు తున్నాయి. జిల్లాలో 6400 ఎకరాల్లో ఉప్పుమడుల నుంచి ఏటా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పు ఉత్పత్తవుతోంది. దేశంలో ఉప్పు ఉత్పత్తిలో అయిదో స్థానం, రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చినగంజాం తర్వాత రెండో స్థానం సంపాదించిన సంతబొమ్మాళి నౌపడా ఉప్పు పరిశ్రమ ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉప్పు ఉత్పత్తి జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క నౌపడా సర్కిల్ పరిధిలోనే 4000 ఎకరాల్లో ఉప్పు సాగవుతూ రాష్ట్ర చిత్రపటంలో నౌపడా తన పేరు నమోదు చేసుకుంది. జిల్లాకు సంబంధించి పూండీ, కళింగపట్నం, కుప్పిలి, భావనపాడు, మూలపేట, నౌపడా గ్రామాల్లో ఉప్పు ఉత్పత్తి ఎక్కువగా చేస్తున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఈ ఉప్పు పరిశ్రమపై ఆధారపడి నౌపడా సర్కిల్ పరిధిలో సుమారు పది వేల మంది కార్మికులు, కార్మికేతరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. అత్యధిక ఉత్పత్తి నౌపడా సర్కిల్ పరిధిలోనే జరుగుతుంది.
సంప్రదాయ పద్ధతిలో ఉప్పు పండిస్తున్నారు. చిన్నచిన్న కమతాల వల్ల అధునాతన పద్ధతులు అవలంబించకపోవటం, అయోడైజ్డు ఉప్పు తయారు చేయకపోవటంతో నాణ్యత లోపిస్తోంది. ఉప్పు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా లేక అనువైన వాతావరణం ఉన్నా రైతులకు మేలు జరగడంలేదు. మార్కెటింగు సదుపాయాల్లేక నష్టాలు తప్పటంలేదు. ఇక్కడి ఉప్పు కేవలం ఒడిశా రాష్ట్రానికే ఎగుమతి అవుతోంది. ప్రకాశం జిల్లా మాదిరిగా మడుల్లో ఉప్పునీరు నింపుకోడానికి మోటర్లకు వ్యవసాయ టారిఫ్‌పై విద్యుత్తు సౌకర్యమూ కల్పించడంలేదు. రైతులంతా డీజిల్ ఇంజిన్ల మీదే ఆధారపడుతుండడంతో పెట్టుబడి భారం తడిసి మోపెడవుతోంది. ఉప్పు మడుల్లో కాల్వల్లేక, పూర్వకాలంలో తవ్వించిన కాల్వల్లో పూడిక చేరడంతో మురుగునీరు పోయే మార్గం ఉండడంలేదు. ఉప్పు మడుల్లోనే నీరు నిల్వ ఉండిపోయి నాణ్యత తగ్గుతోంది. అంతర్గత రహదారులు లేక ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. వీటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోగా ఉప్పుశాఖ పట్టించుకోవడంలేదు.
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. పంట నష్టాలు వచ్చినా పరిహారం దక్కడంలేదు. బ్యాంకుల నుంచి ఎలాంటి రుణ సహాయం అందడంలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలకు సర్కిల్ కార్యాలయం సంతబొమ్మాళి మండలం నౌపడాలోనే ఉంది. ఇక్కడ సమీప ప్రాంతంలోనే 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. మేజరు, మైనరు లైసెన్సులతోపాటు, నాన్‌లైసెన్సు సెక్టారులోనూ పండిస్తున్నారు.
- నౌపడాలో 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు,
- వజ్రపుకొత్తూరు మండలం పూండిలో 1500 ఎకరాలు,
- గార మండలంలోని కళింగపట్నంలో 600 ఎకరాలు,
- ఇచ్ఛాపురం వద్ద సుర్లాలో 300 ఎకరాలు కలిపి
salt factories in Srikakulam dist.
- East Coast Salt and Chemicals, Neupada
- Kalinga Salt Industries(P) Ltd., Neupada
- M./s Kalinga Salt Industries (P)Ltd., Bhavanapadu
ఉప్పు రవాణాకు రైల్వేశాఖ మొండిచేయి
- అతి తక్కువ ఖర్చుతో ఎగుమతి చేసే రవాణా ఉంటే ఏ పరిశ్రమ అయినా నిలదొక్కుకుంటుంది. నౌపడా ఉప్పు పరిశ్రమకు ప్రధాన ఆధారమైన రైల్వే రవాణా సౌకర్యం 1990 నుంచి కరువైంది. బ్రిటీష్ పాలకులు అప్పట్లో నౌపడా ఉప్పు పరిశ్రమను గుర్తించి ఉప్పు ఎగుమతికి వీలుగా ఉత్పత్తి కేంద్రానికి రైల్వే లైన్ వేశారు. పరాయి పాలకులు గుర్తింపు తెచ్చి ఆదరించిన నౌపడా ఉప్పు పరిశ్రమ స్వాతంత్య్ర అనంతరం ఆదరణ కరువై అభివృద్ధికి దూరమైంది. ఇక్కడ నుంచి 1990 వరకు ఒడిషా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాగన్లు ద్వారా ఉప్పు ఎగుమతి అయ్యేది. అప్పట్లో ఏటా 9.60 లక్షల బస్తాలు రైల్వే ద్వారా ఎగుమతి అయ్యేది. ఉప్పు పరిశ్రమకు చేయూత ఇవ్వకపోగా 1995 ఫిబ్రవరిలో బ్రిటీష్ కాలం నుంచి ఉన్న రైల్వేలైన్‌ను మరమ్మతులు పేరిట తొలగించి రైల్వేశాఖ ఉప్పు పరిశ్రమను కుప్పకూల్చింది. ప్రస్తుతం నౌపడా ఉప్పు ఒడిషా రాష్ట్రానికి లారీలు ద్వారా సరఫరా అవుతుండడంతో రవాణా వ్యయం పెరిగింది. మరోవైపు తమిళనాడు, గుజరాత్ నుంచి రైల్వే వ్యాగన్లు ద్వారా ఒడిషాకు ఉప్పు వస్తుండడంతో దానిని తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. దీంతో ఒడిషా మార్కెట్‌లో ఇతర రాష్ట్రాల ఉప్పు ఉత్పత్తులకు నౌపడా ఉప్పు పోటీ పడలేక దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికితోడు 1994 జూన్ నుంచి సాధారణ ఉప్పు వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ అయోడైజ్డ్ ఉప్పు ఉత్పత్తి చేయాలని ఆంక్షలు విధించింది. ప్రకృతివరంగా కేవలం శ్రామికశక్తితో ఉత్పత్తి అయ్యే ఉప్పుపై ఆంక్షలు విధించడం 'గోరుచుట్టుపై రోకలిపోటు' పడ్డ చందంగా మారింది. ఉప్పు ఉత్పత్తికి డిసెంబర్‌లో ప్రాథమిక పనులు ప్రారంభిస్తారు. వర్షాలు కురవకపోతే మే, జూన్ వరకు ఉప్పు ఉత్పత్తి చేపడతారు. ఈ సీజన్‌లో ఉప్పు పనులు, ఆ తరువాత వర్షాకాలంలో వ్యవసాయ పనులు చేస్తూ ఈ ప్రాంతీయులు వలసలు పోకుండా జీవిస్తున్నారు.
ఉప్పుపై బడాబాబులు కన్ను
- పేద, ధనికవర్గం తారతమ్యం లేకుండా అందరూ తప్పనిసరిగా వాడకం చేస్తున్న ఉప్పుపై బహుళజాతి సంస్థలు బడా పారిశ్రామికవేత్తల కన్ను పడింది. సాధారణ ఉప్పు వాడకంపై నిషేధం, అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే తినాలంటూ నిర్బంధ చట్టాలు అమలులోకి వచ్చాయి. దీంతో ప్రకృతిపరంగా కేవలం శ్రామికశక్తితో పండే ఉప్పు పనికిరాకుండా పోయింది. రకరకాల బ్రాండ్లతో యాభై పైసలు విలువ కూడా చేయని ఉప్పు అయోడైజ్డ్ ఉప్పు పేరుతో రూ.10/- నుంచి రూ.12/- వరకు అమ్ముడవుతూ సాధారణ ఉప్పు కొంప ముంచింది. చిన్నచిన్న కమతాల్లో సన్నకారు ఉప్పు రైతులు పండించే ఉప్పు బహుళజాతి సంస్థల ముందుకు నిలబడలేక నౌపడా ఉప్పు పరిశ్రమ మూతపడే దశకు చేరిందని చెప్పాలి. ఉప్పు పరిశ్రమకు గిట్టుబాటుధర లేక చాలామంది స్వస్తి పలకడంతో అనాదిగా వస్తున్న ఈ ఉప్పు పరిశ్రమను వదిలి ప్రజలు వలసలు పోవాల్సిన దుస్థితి ఎదురైంది.
ప్రభుత్వం ఎలా ఆదుకోవాలి?
- ఏటేటా ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమవుతున్న ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. తగినంత నష్టపరిహారాన్ని అందించాలి. పురాతన కాలం నుంచి పూడికతో నిండిపోయిన మురుగు కాలువలను, కొట్టుకు పోయిన అంతర్గత రహదారుల్ని అభివృద్ధి చేయాలి. ఉప్పు ఉత్పత్తిదారులకు రుణాలు మంజూరు చేయాలి. ఇతర ప్రాంతాల మాదిరి నౌపడా సర్కిల్ పరిధిలోని రైతులకూ వ్యవసాయ టారిఫ్‌పై విద్యుత్ సదుపాయం కల్పిస్తే నష్టాల నుంచి బయటపడొచ్చు. ఉప్పు శాఖ కూడా సెస్ నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేయాలి.
- ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తరతరాలుగా చేపడుతున్న ఈ సాంప్రదాయ ఉప్పు ఉత్పత్తి రంగాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే సాధారణ ఉప్పు నుంచి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పితే ఇటు ఉప్పు పరిశ్రమకు, అటు కార్మిక, కార్మికేతర వర్గాలకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశముందని ఉప్పు కార్మికులు, ఉప్పు ఉత్పత్తి రైతులు కోరుతున్నారు.
- ============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !