Friday, April 15, 2011

Whether pollution in Srikakulam, శ్రికాకుళం లో వాతావరణ కాలుస్యము
వాతవరణంలో విష వ్యర్థాలు పెచ్చుమీరుతున్న కాలుష్య నేరాలు నియంత్రణ మండలి చర్యలు శూన్యం పట్టించుకోని జిల్లా యంత్రాంగం విజృంభిస్తున్న ప్రమాదకర వ్యాధులు ఉదాసీనంగా వ్యవహరిస్తే తీవ్ర నష్టం

-- ప్రకృతిని నీవు ప్రేమిస్తే... అది నిన్ను ప్రేమిస్తుంది.. ఇది సహజ సూత్రం.. ప్రకృతిని ధ్వంసం చేస్తే... కచ్చితంగా మనల్ని ధ్వంసం చేసి తీరుతుంది... ఇది జగమెరిగిన సత్యం హత్య, మానభంగం, ఆస్తి తగాదాలు, దొంగతనాలు, దోపిడీలు, ప్రమాదాలు, ఫోర్జరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ నేరాలే.. మనమూ ఆ విధంగానే పరిగణిస్తున్నాం. ఇంతకంటే ప్రమాదకరమైంది పర్యావరణ నేరం.. ఇది సమస్త జీవరాశుల మనుగడకే మరణశాసనం. వాహనం.. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల గాలి.. నీరు.. ఆహారం కలుషితమవుతోంది. పుట్టబోయే పసికందులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. మనిషి జీవించే హక్కుని కాలరాస్తూ కాలుష్య విష వ్యర్థాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పారిశ్రామికీకరణకు సంతోషించాలో.. పర్యావరణ చట్టాలను అమలు చేయలేని యంత్రాంగాన్ని చూసి విచారపడాలో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

జిల్లా ముఖద్వారం రణస్థలం మండలం పైడి భీమవరం వచ్చేసరికి ముక్కుపుటాలు అదురుతాయి. గాఢతగల వాయువుల ప్రభావం దీనికి కారణం. తర్వాత కళ్లు మండుతాయి. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వచ్చేసరికి పరిశ్రమల నుంచి వచ్చే దుర్వాసనకు కడుపు తిప్పేస్తుంది. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో విస్తారంగా ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల ప్రభావానికి అక్కడి గాలి, నీరు, భూమి కలుషితమైపోతున్నాయి. రాత్రి వేళల్లో శ్రీకాకుళం పట్టణానికీ ఈ సెగ తగులుతోంది.
* రణస్థలం మండలం గొల్లపేటకు చెందిన గోవింద అంతవరకు చలాకీగా తిరిగిన యువకుడు. ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం వైద్య పరీక్షలు చేయించడంతో క్యాన్సర్‌ అని తేల్చారు. జబ్బు నయం చేసుకోవడాకి కొంత ఖర్చు చేసినా చివరికి మృత్యువే జయించింది.

* దేవునిపాలవలసకు చెందిన అప్పలస్వామి కూడా స్థానికంగా ఉన్న పరిశ్రమలో కొన్నాళ్లు రోజువారీ కూలీగా పనిచేశాడు. చివరికి అతను పక్షవాతంతో మంచం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

* లావేరు మండలం మురపాక చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్‌ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో 30 మంది వరకు మృత్యువాత పడగాపదుల సంఖ్యలో ఇంకా బాధితులున్నారు.

* ఎచ్చెర్ల మండలం శేషుపేట, కేసుదాసుపురం, అరిణాం అక్కివలస, చిలకపాలెం, లోలుగు ప్రాంతాల్లో పక్షవాతం, క్యాన్సర్‌, ఇతర రోగాలతో బాధపడుతున్నవారు వందల సంఖ్యలో ఉన్నారు.

* కాశీబుగ్గ ప్రాంతంలో వందలాది మంది శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారెంతో మంది ఉన్నారు.

జిల్లాలో ఇలా ఎక్కడ చూసినా రోగాలు పంజా విసురుతున్నాయి. ఒకపక్క ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య అంతుచిక్కటంలేదు. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే అరుదుగా వచ్చే బోన్‌మారో (ఎముక మజ్జిలో రక్తం ఉత్పత్తి నిలిచిపోవడం) వంటి రోగాల ఆనవాళ్లు జిల్లాలో కనిపిస్తున్నాయి.

కాలుష్యం నేరాలు ఇవీ
* ఆరు నెలల కిత్రం ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద ఉన్న ఒక పరిశ్రమ వద్ద కలుషిత జలాలు తాగి పశువులు మృతి చెందాయి. దీనికి సంబంధించి పోలీసులు ఫాక్టరీస్‌ ఏక్ట్‌, ఐపీసీ 279 కింద కేసులు నమోదు చేసినా కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోలేదు.

* జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఒక పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసన భరించలేని స్థాయిలో ఉంది. పోలీస్‌ ఉన్నతాధికారులు కేసులు నమోదు చేయమని దిగువస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినా అమలు చేయలేకపోయారు.

హెచ్చుస్థాయిలో తీవ్రత
జిల్లాలో 196 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారిపై సుమారుగా ప్రతీ రోజూ 8 నుంచి 10 వేల వరకు వాహనాలు అటూఇటూ తిరగుతుంటాయి. వాటిలో 30 శాతం వాహనాలు విపరీతమైన పొగ వదులుతున్నట్లు సర్వేలు తేల్చాయి. పరిశ్రమలు, వాహనాల వల్ల వాతావణంలో ఉండాల్సిన వాయువుల శాతంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు రావడం వాస్తవమేనని కాలుష్యనియంత్రణ మండలి శాస్త్రవేతలుఅంగీకరిస్తున్నారు. వాతావరణంలో నత్రజని 78.08, ఆక్సిజన్‌ 20.87, ఆర్గాన్‌ 0.93, కార్బన్‌డైఆక్సైడ్‌ 0.03, మీథేన్‌ 0.002, హైడ్రోజన్‌ 0.00005 శాతం ఉండాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లో హెచ్చుతగ్గులు తప్పడం లేదు. వీటివల్ల శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.

* గాలి కలుషితమవడం వల్ల అందులో చేరే కార్బన్‌మోనాక్సైడ్‌ అనే విషవాయువు వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా తలనొప్పి వస్తుంది.

* పరిశ్రమల్లో విడదలయ్యే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌తో ముక్కులోపల పొరలు దెబ్బతింటాయి.

* పరిశ్రమలు, వాహనాల వల్ల విడుదలైన కార్బన్‌డైఆక్సైడ్‌, ఇతర వాయువుల వల్ల ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రభావం చూపడమే కాకుండా క్యాన్సర్‌కు కారణమవుతుంది.

* అన్నిరకాల కాలుష్యం వలన చర్మసంబంధ వ్యాధులు తీవ్రంగా ఉంటాయి.

* ప్రస్తుతం నీరు, గాలి కలుషితమవడం వల్ల బోన్‌మారో, క్యాన్సర్‌ వ్యాపిస్తున్నాయి.

సముద్రంపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం రణస్థలం ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వల్ల జిల్లాలో సముద్ర తీరంపై తీవ్ర ప్రభావం పడింది. గత పదేషళ్లుగా మత్స్య సంపద పూర్తిగా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్‌కు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
రక్తం తగ్గిపోతోంది
పరిశ్రమలు పెట్టినపుడు అందరికీ ఆనందంగా ఉండేది. వాటి ప్రభావం ఇప్పుడు చూపిస్తోంది. పైడిభీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. గాలి, నీరు కాలుష్యంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు.
కాలుష్యంతో సతమతం
రాత్రివేళల్లో గాలి ద్వారా దుర్వాసన గ్రామాల్లోకి వస్తోంది. ఇప్పటికే గెడ్డలో పైపులైన్లు వేయడం వలన నీటి వనరులు కలుషితమవుతున్నాయి. దీని ప్రభావం ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికైనా కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటే ఉపయోగంగా ఉంటుంది

--'ఈనాడు-ఈటీవీ'-సౌజన్యము తో

  • =======================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

1 comment:

Your comment is important for improvement of this web blog . Thank Q !