Tuesday, July 29, 2014

Nutrition centers in Srikakulam,పోషకాహార కేంద్రాలు-శ్రీకాకుళం

  •  

  •  
గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించి మాతృ శిశుమరణాలను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేస్తున్నా క్షేత్రస్థాయిలో దీన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆశించిన ప్రయోజనం కనిపించడంలేదు. ఒకవైపు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికి మరింత మెరుగైన పోషకాహారం అందజేయాలనే ఉద్దేశంతో ఇక్రాప ఆధ్వర్యంలో ఆరోగ్య పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ప్రారంభం నుంచి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. పౌష్టికాహారానికి అవసరమైన కోడిగుడ్లును అందించేందుకు వీలుగా గతంలో కేంద్రాలకు కోళ్లును సరఫరా చేశారు. ప్రస్తుతం కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు ఎకంగా సాగుకు సిద్ధపడుతున్నారు. ఈ విధంగా కేంద్రాల నిర్వహణకు నిధులు ఖర్చు జరుగుతున్నప్పటికి లక్ష్యం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో పౌష్టికాహారం నామమాత్రంగా మారింది. నిధులు ఖర్చుకు ఆసక్తి చూపుతున్న అధికారులు వీటి పనితీరుపై దృష్టిసారించకపోవడం, అవగాహన కల్పించకపోవడం వంటి కారణాలతోకేంద్రాల పోషకాహారం మొక్కుబడిగా మారింది.
ఇదీ ఉద్దేశం
పౌష్టికాహార లోపంతో అనేకమంది తీవ్ర ఇబ్బందులకు గురవున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2010లో జి.సిగడాం, నందిగాం మండలాల్లో ప్రయోగాత్మకంగానూ, 2011లో లావేరు, రణస్థలం, గార, వీరఘట్టం మండలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు మండలాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామైఖ్యసంఘాలకు అప్పగించారు. వీటి ద్వారా గర్భిణులకు, బాలింతలకు, రెండేళ్లులోపు పిల్లలకు ప్రతిరోజు ఉదయం కోడిగుడ్డు, పాలు, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టి వారిలో పోషకాహారం పెంపొందించాలి. ఇందుకు గానూ భోజనం చేసిన గర్భిణిలు, బాలింతలు రోజుకు రూ.10 వంతున కేంద్రాలకు చెల్లించాలి.

తగ్గని నిధులు ఖర్చు
కేంద్రాల నిర్వహణకు గతంలో ఇచ్చిన నిధుల్లో ఇప్పటికే సగం వరకు ఖర్చుచేసినట్లు లెక్కలు చూపుతున్నారు. ప్రారంభంలో ఒక్కొక్క కేంద్రానికి రూ.మూడు లక్షలు వంతున చెల్లించారు. ఇందులో రూ.50వేలుతో కేంద్రాలకు అవసరమైన సామగ్రి, టీవీలు, డివీడీలు కొనుగోలు చేశారు. మిగిలిన రూ.2.50 లక్షలను గ్రామాల్లో రుణాలుగా అందజేసి వాటి ద్వారా వచ్చిన వడ్డీడబ్బులతోపాటు భోజనం చేస్తున్న గర్భిణిలు, బాలింతలు చెల్లిస్తున్న డబ్బులను వీటి నిర్వహణకు వినియోగించాలి. ఈ కేంద్రాల ద్వారా సక్రమంగా పౌష్టికాహారం అందకపోయినప్పటికీ నిధులు ఖర్చు మాత్రం జరిగిపోయింది. ఇప్పటికే ఒక్కొక్క కేంద్రంలో రూ.50 వేలు నుంచి రూ.లక్షవరకు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. ఈ లెక్కన చూస్తే కేంద్రాల పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుంది.

కనుమరుగైన కోళ్లు
కేంద్రాలకు సొంతంగా కోడిగుడ్డులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో గతేడాది ఒక్కొక్క కేంద్రానికి 75 కోళ్లు వంతున ఇచ్చారు. వీటిని పెంపకం చేసి వాటి ద్వారా వచ్చిన గుడ్డులను కేంద్రాలకు వినియోగించాలి. మిగిలిన వాటిని ఇతరులకు విక్రయించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్రాల నిర్వహణకు ఉపయోగించాలి. క్షేత్రస్థాయిలో మాత్రం ఇదీ సాధ్యం కాలేదు. ఇచ్చిన కొద్దినెలలకే కేంద్రాల్లో సగం వరకు కోళ్లు కనిపించకుండాపోయాయి. వాతావరణం అనుకూలించలేదని, తెగుళ్లు వచ్చి మరణించాయని ఇలా రకారకాల కారణాలు చూపించి కోళ్లను కనుమరుగు చేశారు. దీంతో ప్రస్తుతం ఒక్కొక్క కేంద్రంలో కేవలం 10 నుంచి 15 కోళ్లు మాత్రమే మిగిలాయి. గుడ్డులు కోసం ఇచ్చిన కోళ్లు పరిస్థితి ఇలా మారడంతో అధికారుల లక్ష్యం నీరు గారింది. దీంతో ఎప్పటిమాదిరిగానే కోడి గుడ్డులను మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

కూరగాయలు సాగుకు సిద్ధం
కూరగాయలు ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండటంతో కేంద్రాల నిర్వహణ భారంగా ఉంటుందనే ఉద్దేశంతో వీటి పరిధిలో ఏకంగా కూరగాయలను పండించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కొక్క కేంద్రం పరిధిలో అరఎకరా సాగుభూమిని లీజుకు తీసుకొని కూరగాయలను సాగుచేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆరు మండలాల్లో 46 కేంద్రాల వద్ద అవసరమైన భూమిని సేకరించారు. భూమి చుట్టూ కంచె, తీగలు, విత్తనాలు, నారు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక్కొక్క కేంద్రం పరిధిలో ఉపాధిహామీ పథకం ద్వారా రూ.1.18 లక్షలు ఖర్చు చేసేందుకు కేటాయించారు. వీటిని సాగుచేసేందుకు ఒక రైతును ఎంపిక చేశారు. భూమి లీజు ఖర్చు, సాగుకు అవసరమైన ఇతర ఖర్చులను సంబంధిత రైతు, కేంద్రాలు నిర్వహణ చేస్తున్న గ్రామైఖ్యసంఘ అధ్యక్షురాలు భరించాలి. వచ్చిన ఫలసాయం సగం సగం వాటాలు వేసుకోవాలి. అధ్యక్షురాలు వాటాగా వచ్చే కూరగాయలను కేంద్రాలకు వినియోగించడంతోపాటు మిగిలిన వాటిని విక్రయించి వచ్చిన ఆదాయం కేంద్రాల ఖాతాకు జమచేయాలి. ఇప్పటికే 22 కేంద్రాల పరిధిలో కూరగాయలను సాగుచేస్తున్నారు. మిగిలిన చోట్ల సాగుకు అవసరమైన పనులు చేస్తున్నారు. ఈ ఆలోచన విధానం మంచిదైనప్పటికీ ఇప్పటికే కోళ్లును కనుమరుగు చేసిన నిర్వాహకులు కూరగాయలను ఏమి చేస్తారో చూడాల్సి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 ఆరోగ్యపోషకాహార కేంద్రాల ద్వారా మొత్తం 800 మందికి పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్న క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించడంలేదు. కొన్ని చోట్ల కేంద్రాలు సక్రమంగా తెరవకపోవడం, మరికొన్ని చోట్ల నాసిరకమైన ఆహారం వడ్డించడం, కొంతమంది కేంద్రాలు వచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపకపోవడం, మరికొంతమందికి అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఇక్కడకు వచ్చేందుకు వెనుకాడుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు రూ.10 వంతున చెల్లించాల్సి రావడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కేంద్రాలవైపు చూడటంలేదు. ఇలా రకారకాల కారణాలతో పౌష్టికాహారం మొక్కుబడి మారింది. వీటి నిర్వహణకు రూ.లక్షలతో ఖర్చుచేస్తున్న అధికారులు ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడం, పనితీరుపై నిర్లక్ష్యంగా వ్యవహిరించడం తదితర కారణాలతో నిధులు వృధా అవుతున్నాయి తప్ప ఆశించిన ప్రయోజనం కనిపించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కూరగాయల సాగుతోనైనా కేంద్రాల పనితీరు మెరుగుపడేలా కృషి చేస్తే కొంతవరకు ప్రయోజకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం
కేంద్రాల పనితీరు ప్రస్తుతం బాగానే ఉంది. వీటిని మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం. రకరకాల కారణాలతో గతంలో కేంద్రాలకు అందజేసిన కోళ్లు మరణించిన విషయం వాస్తవమే. ప్రస్తుతం కూరగాయలు సాగుచేస్తున్నాం. ఇప్పటికే 46 కేంద్రాల వద్ద సాగుకు సిద్ధపడుతున్నాం. ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సక్రమంగా అందజేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.

- రవి కుమార్‌, ఆరోగ్యపోషణాధికారి, శ్రీకాకుళం@న్యూస్‌టుడే, వీరఘట్టం:

ఇటువంటి ప్రభుత్వ పథకాలు సమాజములో మనుగడ సాగలేవు . ప్రబుత్వ ఉద్దేశమైతే మంచిదే కాని వాటిని నిర్వహించే ఉద్యోగులు ప్రేమానురాగాలతోనూ , బాద్యతాయుతముగాను , తమ సొంత కుటుంబ సబ్యుల లాగాను పనిచేయరు. . . అంతేకాక దొరికింది దోచుకోవడానికే చూస్తారు. ప్రబుత్వమే నేరుగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపినీ వ్యవష్థ ద్వారా ఇవ్వవల్సిన ఆహారపదార్ధాలు ఇస్తే బాగుంటుంది. వేరేగా పరిపాలనా వ్యవస్థ , పంపిణీ వ్యవస్థ అవసరముండదు కదా !.

-- డా.వండాన శేషగిరి్రావు (శ్రీకాకుళం ).

  • ==============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !