Thursday, February 7, 2013

Kathanilayam Srikakulam,కథానిలయం శ్రీకాకుళం


 



  •  
పరిచయం :

-- 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ ఎవార్డు ప్రకటించినప్పుడు కాళీపట్నం రామారావు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ ఎవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో ఎవార్డుని స్వీకరించారు. ఎవార్డుగా వచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి కథానిలయానికి పునాది వేశారు.
కారా మేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు.

కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నించి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనక వేపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలున్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిధి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు.

కథానిలయం చరిత్ర :

కధా నిలయం, తెలుగు కధల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంధాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.

తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కధలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కధానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కధకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంధాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.

1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.

ఇంకా కధానిలయంలో 2,000 పైగా కధల సంపుటాలు, కధా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కధలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కధా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కధలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కధా ఏదో ఒక దృక్పధాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.

ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు. పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి. కారామేస్టార్ని కలవండి.
 పట్టణంలో విశాఖ'ఎ'కాలనీలో రెండు రోజులపాటు కథానిలయం 16వ వార్షికోత్సవం సభలు నిర్వహిస్తున్నట్లు కథానిలయం నిర్వాహకులు తెలిపారు. ఈనెల Feb 09 2013 న మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే సభలో స్వీయపరిచయాలు, పలు పుస్తకావిష్కరణ కార్యక్రమాలుంటాయని తెలిపారు. పదోతేదీ ఉదయం 10 గంటలకు జరిగే వార్షికోత్సవ సభలో డా. కాళీపట్నం రామారావు హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయులు సతీష్‌చంద్ర, చినుకు సంపాదకులు నండూరి రాజగోపాల్‌, కవి, విమర్శకుడు రామతీర్ధల సాహితీ ప్రసంగాలుంటాయని వారు తెలిపారు.

కాళీపట్నం రామారావు జీవిత వెశేషాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .-- కాళీపట్నం రామారావు
  • =========================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !