Sunday, February 26, 2012

Chikkolu Sambaraalu , సిక్కోలు సంబరాలు






18th - 20th Feb.2012--సిక్కోలు సంబరాలను చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జిల్లా కలక్టరు గారి సమాధానము :

-- జిల్లా ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తయ్యాయి. షష్టిపూర్తి ఉత్సవాలు జరపాలని, జిల్లా చరిత్ర అందరికీ తెలియజేయాలని భావించి అధికారులందరితో మాట్లాడాం. శివరాత్రి కూడా కలిసి రావడంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను అందరికీ గుర్తు చేయడంతో పాటు, పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సిక్కోలు సంబరాలు చేపట్టారు.

ఈ సంబరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందా? విరాళాలతోనే చేస్తున్నారా?

--సంబరాల నిర్వహణకు నిధులు కావాలని ప్రభుత్వానికి రాశాం. అయితే ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. సావనీర్‌ ద్వారా వచ్చే విరాళాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్టాల్స్‌ ఏర్పాటుకు నాబార్డు సహకారం అందిస్తోంది. జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులు అందరికీ తెలియాలని స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. మూడు రోజుల పాటు ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం స్థానిక కళాకారులకు ఉంటుంది. ఇతర ప్రాంతాల కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం

సిక్కోలు సంబరాలకు సర్వం సిద్ధం-- ఏర్పాట్లును పరిశీలించిన అధికారులు

జిల్లా కేంద్రంలో ఏడురోడ్లకూడలి దరి ఎన్‌.టి.ఆర్‌. పురపాలకసంఘం ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్న సిక్కోలు సంబరాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మైదానం ఆవరణ చదును చేసి విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. కళాకారుల ప్రదర్శనకు కళావేదికను అందంగా తీర్చిదిద్దారు. మైదానం ఇరువైపులా పుడ్‌స్టాల్స్‌, ప్రభుత్వ స్టాల్స్‌ ఏర్పాటుకు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులకు వైఎస్‌ఆర్‌ కల్యాణ మండపం, ఎం.హెచ్‌.స్కూలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 18 నుంచి మూడు రోజులు పాటు జరిగే సిక్కోలు సంబరాల్లో సుమారు అయిదొందల మంది కళాకారులు పాల్గొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం ప్రభుత్వ మహిళ కళాశాల నుంచి కొందరు కళాకారుల బృందం, కోడిరామ్మూర్తి స్టేడియం దరి అంబేద్కర్‌ ఆడిటోరియం నుంచి మరో బృందం ప్రదర్శనలతో వూరేగింపుగా ఏడురోడ్లకూడలి వరకు వస్తారని తెలిపారు. మూడు రోజులు పాటు ప్రదర్శన తిలకించేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం పదిహేనువందల కుర్చీలు వేయనున్నట్లు తెలిపారు. గురువారం సిక్కోలు సంబరాలు ఏర్పాట్లును ఏజేసీ ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌, డి.ఆర్‌.డి.ఎ. పీడీ పి.రజనీకాంతరావు, మున్సిపల్‌ ఇంజనీర్‌ పొగిరి సుగుణాకరరావు, డా. దవళ భాస్కరరావు, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్‌.రమేష్‌, ఇతర అధికారులు పరిశీలించారు.

- కలెక్టరేట్‌ శ్రీకారంతో ప్రాకారం కట్టుకున్న ఆంధ్రావని ఆభరణం, కళింగ సీమ కంఠాభరణం శ్రీకాకుళం జిల్లా ప్రాభవ వైభవం తెలిపే ప్రతిష్టాత్మక సిక్కోలు సంబరాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా సంస్కృతి సంప్రదాయాలను తెలిపే కళాకారులు, కళారూపాలతో శోభాయాత్ర, శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలతో సిక్కోలు సంబరాలు సాంస్కృతిక సందడి కలిగించాయి. శ్రీకాకుళం పట్టణంలోని పురపాలకసంఘ మైదానంలో సంబరాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భావితరాలకు జిల్లా విశిష్టత తెలియజేయడానికి ఈ సంబరాలు దోహదపడతాయన్నారు. ఈ గడ్డలో ఎంతోమంది సాహితీవేత్తలు, కళాకారులు ఉన్నారన్నారు. ఎన్నికల సంఘ మాజీ పరిశీలకుడు కొమ్మాజోస్యుల జగన్నాథరావు, కథా నిలయ వ్యవస్థాపకుడు కాళీపట్న రామారావును ఘనంగా సత్కరించారు. అనంతరం 'జయజయ శ్రీకాకుళం' నృత్య రూపకంతో పాటు అనేక జానపద శాస్త్రీయ నృత్యాలు కనువిందు చేశాయి. కలెక్టరు జి.వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు పీరుకట్ల విశ్వప్రసాద్‌, గాదె శ్రీనివాసులు నాయుడు, ఎస్‌.పి. కె.వి.వి.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
--
  • నేడు లోక్‌ కళాయాత్ర
డురోడ్ల కూడలి దరి ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో శుక్రవారం వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల లోక్‌కళాయాత్ర జానపద కళాప్రదర్శనలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌కు చెందిన 70 మంది కళాకారుల జానపద కళాప్రదర్శనలు ఉంటాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి లోక్‌కళాయాత్ర ప్రదర్శనలు ఉంటాయని జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి రమేష్‌ తెలిపారు

  • ఘల్లుమన్న జానపదం... జల్లుమన్న జనహృదయం..
జిల్లా కేంద్రంలో ఏడు రోడ్ల కూడలి దరి ఎన్టీఆర్‌ పురపాలక సంఘం ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నాగపూర్‌ దక్షిణ ప్రాంత సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన లోక్‌ కళాయాత్ర, జానపద నృత్య ప్రదర్శనలు జనరజకరంగా సాగాయి. తొలుత ప్రదర్శించిన మధ్యప్రదేశ్‌ రాష్ట్ర కళాకారులు 15 మంది వేణుగానానికి అనుగుణంగా చేసిన షైలార్‌ నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ కళాకారుల ఫంథీ నృత్యం, ఆపై మహరాష్ట్ర కళాకారుల ఛత్రపతి శివాజీ- విలువిద్యా విన్యాసాల డాన్‌పట్టా నృత్యం ఆకట్టుకున్నాయి. మన రాష్ట్రానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన తప్పెటగుళ్లు విన్యాసాలు అందర్నీ ఆలరించాయి. కర్నాటక బృందం చేసిన డోలుకునీత్‌ డ్రమ్స్‌ నృత్యమూ ఆకట్టుకుంది. కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి జ్యోతి వెలిగించి ఉత్సవాల్ని ప్రారంభించగా, ఏజేసీ రాజ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ, డీపీఆర్‌వో ఎల్‌.రమేష్‌, జడ్పీ సీఈవో, దక్షిణ ప్రాంత సాంస్కృతిక కేంద్రం ప్రోగ్రాం డైరెక్టర్‌ పి.ఎస్‌.తివారీ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు లోక్‌కళాయాత్ర కళాకారులు ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనల సమయంలో విద్యుత్తు లేకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

--

జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే మహిళలకు సంబరాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని కలెక్టరు వెంకట్రామిరెడ్డి చెప్పారు. సిక్కోలు సంప్రదాయ మహిళ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎస్సీ కార్పోరేషన్‌ ఇ.డి. సిహెచ్‌.మహాలక్ష్మి, జెనీస్‌ ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టరు ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌, నాబార్డు ఎ.జి.ఎం. సుబ్రహ్మణ్యం, జెసీస్‌ ఫెమినా ప్రతినిధులు గీతా శ్రీకాంత్‌, నీలిమా శివప్రసాద్‌, రజనీ, సుజాత, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

  • సిక్కోలు చిన్నది... అందాల్లో విరబూసింది...
అందమైన భామలు... లేత మెరుపు తీగలు..
అచ్చమైన సంప్రదాయ లంగావోణీల హొయలు...
బంగరు నగలు... చేతులనిండా గాజులు..
సిక్కోలు సొగసు కళ్లకు కట్టి చూపించారా యువతులు..
--
సంబరాల్లో భాగంగా పట్టణంలోని ఓ హోటల్‌లో సిక్కోలు చిన్నది.. సిక్కోలు సంప్రదాయ మహిళ పేరిట వస్త్రాలంకరణ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 80 మంది పాల్గొన్నారు. ఆటలు.. మాటలు.. పాటలతో అలరించారు.

* సింగుపురం నుంచి ఆవాల గంగమ్మ, గొంటి నరసమ్మ సిక్కోలు ప్రాంతం చీరలు, మెట్టలు ముడుచుకొని కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డితో పాటు ప్రదర్శనలో పాల్గొన్నారు. జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఆర్‌.వి.నాగరాణి, సాంఘిక సంక్షేమాధికారిణి కె.వి.ఆదిత్యలక్ష్మి, జి.లక్ష్మిస్వామినాయుడు, హరితా రామలింగేశ్వర్‌, స్వర్ణ, లత, యామిని, చాపర విజయలక్ష్మిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

  • సిక్కోలు ఘుమ ఘుమలు
మహిళా కమిటీ విభాగం ఆధ్వర్యంలో సిక్కోలు సురుచులు పేరిట వంటలపోటీ నిర్వహించారు. స్థానిక సంప్రదాయ వంటలతోపాటు కొత్తకొత్త రకాలను ఘుమఘుమలాడించారు. అలనాటి బలవర్థక పోషక విలువలు కలిగిన చోడి పిండితో తయారు చేసిన పదార్థాలతో పాటు ఆధునిక కాలంలో చేసే బ్రడ్‌చోప్‌, సోయామంచూరియా వంటి వంటకాలతో మహిళలు అలరించారు. కూరగాయలు, ఖర్జురం వంటి పళ్లతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. అరిసెలు, చంద్రకాంతలు, పులిహోర, పచ్చళ్లు షరా మామూళ్లే. 40 మంది మహిళలు 62 వంటకాలతో ప్రదర్శనలో పాల్గొనడం విశేషం.

రాగిపిండి హల్వా: పట్టణానికి చెందిన గృహిణి పి.లత... బెల్లం, చోడిపిండి, కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్‌ పదార్థాలతో తయారు చేసిన రాగిపిండి హల్వా (రాగితోప)ను సాంప్రదాయవంటకంగా ప్రదర్శించారు. ఈ ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి బలవర్థకమైన పోషక విలువలతో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుందని లత పేర్కొన్నారు. మధుమేహ వ్యాధికి, మహిళలకు, ఆడపిల్లలకు మంచి శక్తినిస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఈ వంటకాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చు. కె.శ్రీదేవి తయారు చేసిన రాగితోప ఉండలు వంటకం ప్రదర్శించారు. ఈ వంటకం తాతముత్తాతల కాలం నుంచి సంప్రదాయ వంటకంగా వస్తోందని ఆమె చెప్పారు. ఇది మంచి బలవర్ధకమైన ఆహారమని తెలిపారు. ఆర్‌. ఇందుమతి, విజయలక్ష్మి బెల్లం, పాలతో కలిపిన చోడిపిండితో తయారు చేసిన తోపను అందంగా అలంకరించి ప్రదర్శనలో ఉంచారు. ద్రాక్షాయిణి చేసిన రాగి హల్వా ప్రదర్శనలో ఉంచారు.

  • సంప్రదాయ రుచులు:
మునగాకుల రసం, పండు మిరప, టమోట, వెల్లుల్లితో తయారు చేసిన పచ్చడి. బెల్లం, చింతపండు తయారు చేసిన బెల్లం పులిహోర, జనుములు పొడి చేసి, పచ్చి బఠాని, వంటకాయలతో తయారు చేసిన కూర ప్రదర్శించారు. ఇవన్నీ పోషకాహార విలువలు కలిగిన వంటకాలని కె.జ్యోతిర్మయి తెలిపారు.

నువ్వుల అరిసెలు: సాధారణంగా పల్లెల్లో తయారు చేసే నవ్వుల అరిసెలు, చంద్రకాంతలను ఎన్‌.ప్రమీలా ప్రదర్శనలో ఉంచారు. బియ్యం పిండి, బెల్లం, నువ్వులతో అరిసెలు, పెసలు, పంచదార, బియ్యం పిండితో వండిన చంద్రకాంతలు సాంప్రదాయ వంటకాలు అని చెప్పారు.

బ్రడ్‌చోప్‌: బ్రడ్‌చోప్‌ అనే నూతన వంటకాన్ని వై.రమణమ్మ తయారు చేశారు. బంగాళదుంపలు, పచ్చబఠాని, క్యారెట్‌, బ్రడ్‌తో దీన్ని తయారు చేశారు. బంగాళ దుంపలను ఉడకబెట్టి, బఠాణీలు, క్యారెట్‌ను ముద్దగా చేసి ఉండలుగా చూట్టాలన్నారు. బ్రడ్‌ నీటిలో నానబెట్టి ముద్ద చేసి, నూనెలో వేపాలన్నారు. ఈ బ్రడ్‌చోప్‌ను కొత్తిమీర పచ్చడితో తింటే మరింత రుచిగా ఉంటుందన్నారు.

సిక్కోలు అదిరిపోయింది.. 5 వందలమంది కళాకారుల కళోపాసనతో తనివితీరా తరించిపోయింది. చిన్నారులు.. చిచ్చరపిడుగులే అయ్యారు.. యువత కేక పెట్టింది.. పెద్దలు చిన్నపిల్లలే అయ్యారు. జిల్లాలోని ప్రతిభావంతులకు సరైన వేదిక ఉండాలన్న సంకల్పంతో జిల్లా అధికార యంత్రాంగం తలపెట్టిన సంబరాలు సోమవారం రాత్రి ఘనంగా ముగిశాయి. సిక్కోలు కాటన్‌ సీఆర్‌ఎం పట్నాయక్‌కు అధికారులు సత్కరించారు. శాస్త్రీయ జానపద నృత్యాలు, చిన్నారుల నృత్య కళా ప్రదర్శనలు, బుల్లితెర, వెండితెర కళాకారుల కళాకదంబం హాస్య రసగుళికలు సంబరాలను ఆనంద సందడి చేశాయి. నేటితరానికి తెలియని ఎన్నో ప్రాచీన కళా రూపాలతో పాటు ఎందరో కళాకారులు వైవిధ్య భరితమైన ప్రదర్శనలిచ్చారు. ప్రసిద్ధ సినీ నటుడు తనికెళ్ల భరణి నేతృత్వంలో 108 మంది చిన్నారులతో శివతత్వం ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది.


సిక్కోలు సంబరాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం నాగావళి హోటల్‌లో నిర్వహించిన ఆరోగ్య బాలల పోటీలు ఆకట్టుకున్నాయి. రెండు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులు ఆకర్షణీయమైన రంగురంగుల దుస్తుల్లో.. బుడిబుడి అడుగులేస్తూ.. చిట్టిపొట్టి మాటలతో ఆహూతులను పులకింపజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసిద్ధ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు పిల్లలను ఆశీర్వదించారు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని హాస్య సన్నివేశాలను చెప్పి అందరినీ నవ్వించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ సీహెచ్‌.మహాలక్ష్మి, ఆర్‌.వి.నాగరాణి, గీతా శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా శారదా, విజయ్‌కుమార్‌, డి.ఎస్‌.ఒ. కె.నిర్మలాభాయి, హెచ్‌.లక్ష్మిపతి వ్యవహరించారు.

* రెండున్నరేళ్ల బి.ఆశిష్‌కు బాలల ఆరోగ్య పోటీల్లో మూడో బహుమతి లభించింది. 15 కిలోల బరువున్న ఆశిష్‌ ట్వింకిల్‌కిడ్స్‌ పాఠశాలలో చదువుతున్నాడు.


  • ========================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !