ధర్మక్షేత్రం.. మార్గదర్శనం ,ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోశివానంద ధర్మక్షేత్రం- పొందూరు ప్రసిద్ధి ..ఆ వాతావరణం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది.. అక్కడి ప్రసంగాలు మనసును హత్తుకుంటాయి. మానవత్వానికి మేల్కొల్పుతాయి.. ఉద్యోగం.. వ్యాపారం... ఇతర వృత్తుల్లో వారమంతా అలసిపోయి.. ఆదివారం అక్కడికి చేరుకోగానే మనసు తేలికవుతుంది. నూతనోత్తేజం పొందిన అనుభూతి కలుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గడిపి బోలెడు సంతోషంతో ఇంటికి తిరుగుముఖం పడతారు. వసదైక కుటుంబ భావనకు, విశ్వప్రేమకు ఆధ్యాత్మికత పునాది. శారీరక, మానసిక వికాసానికి, ప్రకాశానికి సరియైన గమ్యం ఇదేనని పలువురి నమ్మకం. జిల్లా వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కేంద్రాలు వేల మంది నమ్మకానికి కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఈ కేంద్రాలు ఆధ్యాత్మిక భావాలను వ్యాప్తి చేయడంతోపాటు, పలు సంఘ సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. అలాంటి వాటిలో పొందూరు మండలం లయిదాంలోని శివానంద ధర్మక్షేత్రానికి ప్రముఖ స్థానం ఉంది.
ఆధ్యాత్మికతకు ప్రతిబింబం..
స్థానిక రైల్వే స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లయిదాం శివానంద ధర్మక్షేత్రం, దాని అనుబంధ రామధామం ఆధ్మాత్మికతకు ప్రతిబింబంగా నిలుస్తునాయి. నిత్యం సనాతన ధర్మ పరిమళాలతో గుభాళిస్తున్న ఈ క్షేత్రానికి జిల్లా వెలుపలా మంచి పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం భక్తుల కోలాహలంతోపాటు భగవన్నామం ప్రతిధ్వనిస్తుంటుంది.
రామయోగి ఆధ్వర్యంలో
ఈ క్షేత్రానికి మూల స్తంభం దివంగత రామయోగి. ఆయన కృషితో ఈ ధర్మక్షేత్రం 1983లో అవతరించింది. తన యావదాస్తులను ఆశ్రమానికే సమర్పించారు. అప్పట్లో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఆయన నిర్యాణం చెందినప్పటికీ ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఎన్నో కార్యక్రమాలు
రోజూ పల్లె మేల్కొనక ముందే ధ్యానంతో ఇక్కడ దినచర్య ప్రారంభమవుతుంది. సామూహిక గీతాపారాయణం, రామాయణ, మహాభారత, భగవద్గీతల పఠనాలతో ఆశ్రమం ప్రతిధ్వనిస్తుంది. ప్రతినెల మొదటి ఆదివారం సత్సంగ మాధురి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలతోపాటు ఏడాది పొడువునా ఇక్కడ అన్న, వస్త్రదానాలు జరుపుతుంటారు. అవసరాన్ని బట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. రోజూ సుమారు 25 మందికి అన్నదానం చేస్తున్నారు. కార్తీక మాసం మొదటి ఆదివారం మూడువేల మంది వరకు అన్నదానంలో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వైద్యశిబిరాల్లో వంద మంది వరకు ప్రజలు పాల్గొంటున్నారు. 2002 నుంచి శివానంద దివ్యజీవనం మాస పత్రికను ప్రచురిస్తున్నారు.
ప్రముఖుల సందర్శన
ప్రతినెలా మొదటి ఆదివారం, పర్వ దినాల్లో ఆశ్రమానికి వచ్చే భక్తులు గంటల తరబడి ప్రముఖుల ఉపన్యాసాలను విని సంతృప్తిని పొందుతున్నారు. ధార్మిక సందేహాలుంటే నివృత్తి చేసుకుంటారు. చినజీయర్ స్వామి, విష్ణు సేవానందగిరిస్వామి, సమతానందస్వామి, యోగానందభారతి వంటి ప్రముఖలెందరో ఈ ఆశ్రమాన్ని సందర్శించారు.
ఆహ్లాదకరం సీతారామ పుష్కరిణి
ఆశ్రమానికి అనుబంధంగా పశ్చిమ దిశలో రామధామం సముదాయంలోని కోనేరును సీతారామ పుష్కరిణిగా అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణి గట్టుపై యాగశాల, మూడు దివ్య మందిరాలను నిర్మించారు. పుష్కరిణిలో 24 దేవతా విగ్రహాలను ఒరిస్సా శిల్పులు రమణీయంగా తీర్చిదిద్దారు. లక్ష్మీనారాయణ, ఇంద్ర, గరుత్మంత, పార్వతీ పరమేశ్వరులు, నారదాతుంబుర, సరస్వతీ బ్రహ్మ, తదితర విగ్రహాలు సందర్శకులను తన్మయుల్ని చేస్తున్నాయి. మరో 180 విగ్రహాలను నిర్మించేందుకు ఆశ్రమ కమిటీ సిద్ధమవుతోంది.
ఆధ్యాత్మిక భావాల వ్యాప్తి
రామయోగి సంకల్ప బలం, భక్తుల సహకారంతో ఆశ్రమం అభివృద్ధి చెందుతోంది. సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం, విలువలను కాపాడటం, ఆరోగ్యం కోసం ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలు, మంచి ఆహారపు అలవాట్లు నేర్పుతున్నాం.--బ్రహ్మచారి ప్రకాశానంద, ఆశ్రమ అభివృద్ధి సంఘం ప్రతినిధి, లయిదాం.
శాంతియుత జీవనం
ఆశ్రమ సందర్శనతో శాంతియుత జీవనం అలవడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి మార్గంలో నడవాలనే భావన కలుగుతుంది. మాటలకందని అనుభూతిని పొందుతున్నాం.--కొర్ని కృష్ణమూర్తి, భక్తుడు.
జీవితం ధన్యం
ధర్మక్షేత్రాన్ని సందర్శిస్తే చాలు జీవితం ధన్యం అవుతుంది. ఇక్కడి వస్తే అలసట మరచి అలౌకిక ఆనందాన్ని పొందుతాం.--ముద్దపు కామేశ్వరి, భక్తురాలు, గొడబపేట.
- =================================
This is a nice posting`you provide Srikakulam related information
ReplyDelete