Wednesday, February 16, 2011

Poultry industry in Srikakulam , కోళ్ళ (పౌల్ట్రీ)పరిశ్రమ శ్రీకాకుళం లో


పౌల్ట్రీ పరిశ్రమ అంటే ... కోడి మాంసము , కోడి గుడ్ల వ్యాపారము . శ్రీకాకుళం జిల్లాలో సుమారు రోజుకు 6.20 లక్షల గుడ్లు ఉప్తత్తి అవుతుంటాయి . పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభం అంచున పయనిస్తోంది. ఉత్పత్తికీ, వినియోగానికీ మధ్య సమతుల్యం లోపించటమే దీనికి కారణం. ఇలాంటి సందర్భాల్లో ఇటు రైతులకూ, అటు వినియోగదారులకూ నష్టాలు తప్పటం లేదు. గతేడాది చివరి ఆరునెలల్లో పౌల్ట్రీ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అందుకు తగ్గట్లు వినియోగం పెరగలేదు. దీంతో పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు పడిపోయాయి. వీటికి పెరిగిన దాణా, లేబర్‌ ఖర్చులు తోడయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేసిన అప్పుల తీర్చలేక పౌల్ట్రీ ఫారాలను మూసివేశారు. జనవరి వచ్చేసరికి పౌల్ట్రీ వినియోగం భారీగా పెరిగింది. తగినంత ఉత్పత్తి లేకపోవటంతో మాంసం, గుడ్డు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలా వ్యాపారము ఒడుదుడుకులకు లోనవుతూనే ఉంది .

జిల్లాలో పెద్ద పౌల్టీ పారం లు :
  • పాలఖండ్యాం (రాజాం),
  • శ్రీకాకుళం ,
  • ఆమదాలవలస ,
  • పైడిభీమవరం ,
  • అన్నంపేట (సరుబుజ్జిలి),
  • రణస్థలం
ప్రాంతాలలో పౌల్ట్రీలు ఉన్నాయి . ఇవి కాక చిన్నా ... పెద్దా కలిసి మరో 200 (రెండు వందలు) వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 5.70 లక్షల కోళ్ళున్నాయి . వీటి ద్వారా రోజుకు సుమారు 6.20 లక్షల గుడ్లు ఉప్తత్తి అవుతున్నాయి .
నెక్ (National Egg Coordination Committee) నిర్ణయించిన ధరకే అమ్మకాలు అమలు చేస్తున్నారు . పెరిగిన ధరల నేపధ్యము లో ఇలా చేయడం యజమానులకు నస్టమే అయినా తప్పడం లేదు . రిటైల్ ధరలు మాత్రము ప్రాంతానికో విధం గా ఉంటున్నాయి .

కోడి రైతు ఉల్టా పల్టా-వెంటాడుతున్న నష్టాలతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలు -మూతపడుతున్న ఫారాలు

 గ్రామీణ జిల్లాలో ఏటా కోడి మాంసం వ్యాపారం: రూ. 100.80 కోట్లు గుడ్ల వ్యాపారం: రూ. 45 కోట్లు మొత్తం పౌల్ట్రీ వ్యాపారం: రూ. 145.80  కోట్లు జిల్లాలో రూ. 150 కోట్లకు చేరుతున్న కోళ్ల పరిశ్రమతో రైతులు లాభపడుతున్నారా? అంటే పెదవి విరుపే కనిపిస్తోంది. రైతులంతా ఉన్న కోళ్ల ఫారాలను మూసేస్తున్నారు. పెరిగిన కోడి మేత ధరలు, కోళ్లకు రోగాలు, ఏజెన్సీల నుంచి సహకారం కొరవడడం.. తదితర సమస్యలతో కోళ్ల రైతులు నష్టాల బారిన పడుతున్నారు.

వ్యవసాయ రంగం నష్టాలు మిగులుస్తుండడంతో కొన్నేళ్లుగా అవకాశం ఉన్న రైతులు కోళ్ల పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. కొంతమంది సొంతంగా నిర్వహిస్తే, మరికొందరు ప్రైవేటు ఏజెన్సీల ప్రోత్సాహంతో కోళ్లను పెంచి కమిషన్‌ రూపంలో ఫలసాయాన్ని పొందుతున్నారు. కొన్నాళ్ల పాటు దిగ్విజయంగా సాగిన కోళ్ల పెంపకం రెండేళ్లుగా నష్టాల బాటలో పయనిస్తోంది. జిల్లాలో భారీగా కోళ్ల ఫారాలు మూతపడుతున్నాయి.

* జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీల ఆధ్వర్యంలో 265 కోళ్ల ఫారాలు నడుస్తున్నాయి. ఇందులో శ్రీవెంకటేశ్వర ఏజెన్సీ ఆధ్వర్యంలో 135, సుగుణ ఆధ్వర్యంలో 130 కోళ్ల ఫారాలున్నాయి. రెండింటిలో 271 మంది రైతులు కోళ్లను పెంచుతున్నారు. ప్రైవేటుగా మరో 150 మంది రైతులు కోళ్లఫారాలు నెలకొల్పారు.

రైతులు కోళ్ల షెడ్డులను వేసి సిద్ధంగా ఉంచితే జిల్లాలో శ్రీవెంకటేశ్వర, సుగుణ పౌల్ట్రీ వంటి ఏజెన్సీలు పిల్లలు, కోళ్ల మేత అందిస్తున్నాయి. కోళ్లు పెరిగిన తర్వాత ఏజెన్సీలే కొనుగోలు చేసి రైతులకు కమీషన్‌ అందజేస్తాయి.

నష్టాలకు కారణాలేంటి?
* కోళ్ల మేత ధరలు పెరిగిపోవడం, సొంతంగా కోళ్లను పెంచుతున్న వారికి ప్రోత్సాహం లేకపోవడంతో కోళ్ల రైతులు నష్టాలకు గురై ఫారాలను తొలగిస్తున్నారు.
* గతంలో 80 కిలోల కోళ్ల దాణాకు రూ. 1525 వసూలు చేసేవారు. ఇప్పుడు కేవలం 75 కిలోల బస్తా ధర రూ. 1800కు పెరిగింది.
* వ్యాధుల పంజా విసురుతుండడంతో కోళ్లు మృతి చెందుతున్నాయి. * కోళ్లు అనుకున్న స్థాయిలో పెరగడం లేదు. కోళ్లకు సమపోషణ దాణా అందక పోవడమే దీనికి కారణం. ప్రస్తుతం ఇస్తున్న ఆహారంలో నూనె పదార్థాలు తక్కువగా ఉండడంతో కోళ్ల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దాణాలో ఎక్కువగా నూకలు కలిపేస్తుండడం కూడా కోళ్ల ఎదుగుదల తగ్గడానికి కారణమవుతోంది
* కోడి కిలో ధర రూ. 49-55 మధ్య ఉంటే కిలోకు పది పైసలు ఇన్సింటివ్‌ ఇచ్చేవారు. రూ. 55 దాటితే ఐదు పైసలు ఇచ్చేవారు. ఈ మేరకైనా ప్రస్తుతం సక్రమంగా అందించడం లేదు.

ఏటా రూ. 145.80 కోట్ల వ్యాపారం
సంబంధిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో నెలకు సగటున రూ. 12.15 కోట్ల విలువైన మాంసం, గుడ్లు విక్రయమవుతున్నాయి. నెలకు సగటున రూ. 6 లక్షల కోళ్లు అమ్మకాలు సాగుతున్నాయి. ఒక్కో కోడి సగటున రెండు కిలోల చొప్పున లెక్కించిన 12 లక్షల కిలోల మాంసాన్ని జిల్లా ప్రజలు తింటున్నారు. కిలో సగటున రూ. 70 చొప్పున లెక్కించినా నెలకు రూ. 8.40 కోట్లు, సంవత్సరానికి రూ. 100.80 కోట్లు మాంసంపై జిల్లా ప్రజలు ఖర్చు చేస్తున్నారు. ఇక రోజుకు 5 లక్షల గుడ్లు వినియోగం అవుతున్నాయని అంచనా. ఒక్కో గుడ్డు రూ. 2.50 చొప్పున లెక్కించినా రూ. 12.50 లక్షలు గుడ్లుపై ఖర్చు చేస్తున్నారు. నెలకు రూ. 3.75 కోట్లు ఏడాదికి రూ. 45 కోట్ల గుడ్ల వ్యాపారం జరుగుతోంది.

* జిల్లాలో అన్ని కోళ్ల ఫారాల్లో కలిపి 50 లక్షల మాంసం కోళ్లను ప్రస్తుతం పెంచుతున్నారు.
* గుడ్లుకు సంబంధించి జిల్లాలో శ్రీకాకుళం, పైడిభీమవరం, ఆమదాలవలస, కమ్మసిగడాం, పాలఖండ్యాంలో 4.70 లక్షల కోళ్లు పెంచుతున్నారు. వీటిలో రోజుకు 4.23 లక్షల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
* జిల్లా అవసరాలకు కొంత వినియోగిస్తుండగా, ఇతర జిల్లాలకు మాంసం ఎగుమతి చేస్తున్నారు. జిల్లాకు విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి గుడ్లు దిగుమతి అవుతున్నాయి.

ప్రభుత్వ చేయూత
జిల్లాలో కోళ్ల పరిశ్రమ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా.. రైతులను ఆదుకోవడానికి చేయూత కరవవుతోంది. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి రాయితీలు అందడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు ఏజెన్సీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కోళ్ల ఫారాల ఏర్పాటుకు అవసరమైన రుణం అందిస్తే ప్రయోజనంగా ఉంటుందని రైతులు అంటున్నారు. నింగిని తాకుతున్న దాణాను రాయితీపై రైతులకు అందిస్తే పరిశ్రమ మనుగడ ఉంటుందంటున్నారు. దాణా ధరలు అనూహ్యంగా ఏటా పెరిగిపోతుండడంతో పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కోళ్లఫారాల ఏర్పాటుకు ప్రైభుత్వం రుణ సాయం అందించక పోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందాల్సి వస్తోంది. వ్యాపారం ఒడిదొడుకులకు లోనై రుణ వాయిదాలు సకాలంలో చెల్లించలేక అసలుకు వడ్డీ కలసి పెనుభారంగా మారుతోంది. ప్రభుత్వం కోళ్ల రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటే మనుగడ ఉంటుంది.

courtesy with Eenadu@న్యూస్‌టుడే- రాజాం/రణస్థలం
  • ====================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !