వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు పాలిథిన్‌ను విడిచిపెట్టి గోగు (మెస్తా) ఉత్పత్తులను వినియోగించాలని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నా, జ్యూట్ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు ఉత్పత్తి కొన్నేళ్లగా భారీగా తగ్గిపోయింది. పదేళ్ల క్రితం వరకూ గోగు పంటకు రాష్ట్రంలోనే చిరునామాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
ఉత్తరాంధ్ర వాణిజ్య పంటల్లో ప్రధానమైన గోగు నార సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గుతూ వస్తోంది. దీనిపై ఆధారపడి నడుస్తున్న జనపనార పరిశ్రమలకు కష్టాలు ఎదురవుతున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏటా 1,75,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేవారు. 2008లో ఆ విస్తీర్ణం 69,780 ఎకరాలకు తగ్గిపోయింది. విజయనగరం జిల్లాలోనే ఎక్కువగా 1,08,288 ఎకరాల సాగు జరిగేది. విజయనగరంలో ప్రాంతీయ గోగునార పరిశోధన సంస్థతో పాటు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది విశాఖపట్నం జిల్లాలో గోగు పండించడాన్ని మానుకున్నారు. విజయనగరం జిల్లాలో 30,000 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 12,000 ఎకరాల్లో మాత్రమే పండించారు.
ఇవీ సమస్యలు: అననుకూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు కాని ధరల కారణంగా రైతు స్థితిగతుల్లో మార్పు రాకపోవడంతో గోగు సాగు చేయడం మానుకుంటున్నారు.
* ఫలితంగా జనపనార ఆధారిత పరిశ్రమలు సంక్షోభంలో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు ఆశగా చూస్తున్నాయి.
* రాష్ట్రంలో 29 జూట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో గోనె సంచులు చేసే పెద్ద కర్మాగారాలు 9, మిగతావి పురికొసలు, తాళ్లు తయారు చేసేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 13 వరకు పరిశ్రమలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనపనార మిల్లులు 30,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వీరందరి భవిష్యత్తు అంధకారంలో మునిగే ప్రమాదం ఉంది.
దిగనాసిల్లుతున్న దిగుబడి
సహకరించని వాతావరణ పరిస్థితుల్లో ఈ ఏడాది సాగుతో పాటు గోగు నార దిగుబడి కూడా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల నార దిగుబడి కావాలి. కానీ ఈ ఏడాది ఎకరాకు 3 నుంచి 3.5 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. 2008లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 23 లక్షల క్వింటాళ్ల గోగునార ఉత్పత్తి జరిగింది. అది గత ఏడాది 7 లక్షల క్వింటాళ్లకు తగ్గిపోయింది. ఈ ఏడాది 1.3 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. చెరువుల్లో నీరు వరి పంటకు తోడివేయడం వల్ల జనుమును బురద నీటిలో ఊర వేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. దీంతో గోగునార నాణ్యత తగ్గి గిట్టుబాటు ధర రావడం లేదు. గోగు సాగుకు సంబంధించి రైతుకు ప్రోత్సాహం లేకపోవడంతో వారంతా జీడి, మామిడి, సరుగుడు తోటల వైపు మళ్లిపోతున్నారు.
దిగుమతులు నిల్: ఉత్తరాంధ్రలో సాధారణ విస్తీర్ణంలో గోగు సాగు చేస్తే రాష్ట్రంలోని జనపనార పరిశ్రమలకు 70 శాతం ముడిసరకు అవసరాలు తీరిపోతాయి. మిగతా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల నుంచి నుంచి దిగుమతి చేసుకొనే వారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మిల్లు యజమానులు అక్కడి నుంచి జ్యూట్ మన దేశానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది జ్యూట్ పరిశ్రమలకు గడ్డు కాలం తప్పేటట్లు లేదు.
జేసీఐ ప్రేక్షక పాత్ర
గోగునార దిగుమతులు కొనుగోలు చేసేందుకు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) చేతులెత్తేసింది. ఈ ఏడాది ప్రభుత్వం కనీస మద్దతు ధర టన్నుకు రూ.13,750 మాత్రమే చెల్లిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో దీని ధర రూ.25,000 నుంచి రూ.27,000 వరకు పలుకుతోంది. అందువల్ల రైతులు జేసీఐకు గోగు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా జేసీఐ ఒక కిలో గోగు నారనైనా కొనలేదు. రైతులతో ఒప్పందాలు కూడా లేనందున 2008 తరువాత జేసీఐ తరఫున కొనుగోళ్లు నిలిపేసినట్లు ఆ సంస్థ ప్రాంతీయ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.
- ============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !