Sunday, December 8, 2013

Udhyogashri scheem in Srikakulam, శ్రీకాకుళం లోఉద్యోగశ్రీ అమలు




 ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం అందిస్తున్న నగదు రహిత వైద్య సేవలు గురువారం నుంచి అందుబాటులోకివస్తాయి. జిల్లాలో 1.60 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఉద్యోగులు, పింఛనుదారులు వైద్యసేవలు పొందేందుకు ముందుగా ఆసుపత్రుల్లో నగదు చెల్లించి ఆ తర్వాత సంబంధిత శాఖ ద్వారా తిరిగి చెల్లింపు (రీఎంబర్స్‌మెంట్‌) కోసం బిల్లును రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రికి పంపించేవారు. ఈ క్రమంలో ఉద్యోగులు, పింఛనుదారులు అప్పుల పాలుకావడం, రిమ్స్‌ వైద్య సూపరింటెండెంట్‌ కార్యాలయం చుట్టూ  ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది..  సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగశ్రీ పేరుతో నగదు రహిత వైద్య సేవలను అమల్లోకి తీసుకు వచ్చింది.

విధి విధానాలు
పథకం ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులు రూ. 2 లక్షలలోపు వైద్యం చేయించుకోవచ్చు. ఒకవేళ రూ. 2 లక్షలు దాటితే సంబంధిత ఆసుపత్రి వర్గాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తెలియజేసి ఆమోదం పొందాల్సి ఉంటుంది.

* నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులు రూ. 90, గెజిటెడ్‌ ఉద్యోగులు రూ. 120 వంతున ప్రీమియం చెల్లించాలి.

* ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ జారీచేసే ఉద్యోగశ్రీ కార్డు తీసుకోవాలి.

* ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

రూ. 2 లక్షల ఖరీదు చేసే వైద్యసేవలు ఏడాదిలో ఎన్నిసార్లయినా వినియోగించుకునే అవకాశం కల్పించారు.

Srikakulam జిల్లాలో పరిస్థితి:
జిల్లాలో 25 వేల పైబడి ప్రభుత్వ ఉద్యోగులు, 16 వేల పైచిలుకు పింఛనుదారులు ఉన్నారు. వీరందరి కుటుంబాల నుంచి 1.60 లక్షల పైబడి కుటుంబ సభ్యులకు ఉద్యోగశ్రీ వర్తిస్తుంది.

ఉద్యోగశ్రీ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 174, 175, 176 ఉత్తర్వుల్లో ఎన్నో లోపాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
* ప్రధానంగా ఆర్థిక సంవత్సరంలో కుటుంబ సభ్యులందరికీ కలిపి రూ. 2 లక్షల ఖరీదు గల చికిత్సలకే పరిమితి విధించారు. ఆపైన జరిగే ఖర్చుకు హైదరాబాదు స్థాయిలో అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నిబంధన పైరవీలకు, లంచాలకు అవకాశం కల్పిస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు తరుచూ ఎదురయ్యే మధుమేహం, బీపీ, థైరాయిడ్‌, చర్మ, నరాలు, దంత, శస్త్రచికిత్సతో కూడిన ప్రసూతి, దృష్టి తరహా 457 వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలనే షరతు విధించడాన్ని తప్పుపడుతున్నారు. ఆయా వ్యాధుల్లో తీవ్రత ఉన్న పక్షంలో సంబంధిత ప్రభుత్వ వైద్యుడు తమ స్థాయిలో వీలుకాదని ధ్రువీకరించి రిఫర్‌ చేస్తేనే కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లే వీలుంది. ఇది అనుకున్నంత సులభం కాదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక్కడా పైరవీలు, లంచాలకు ఆస్కారం కలుగుతుందని వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం ఉచితంగా లభించే సేవలను సైతం పొందుపరిచి ఉద్యోగశ్రీ పేరు మీద ఆర్భాటం చేయడాన్ని తప్పుపడుతున్నారు.

* మధుమేహం, బీపీ, అర్థ్రటిస్‌ తదితర జబ్బులకు నిత్యం అవసరమయ్యే మందులను సైతం ఉచితంగా ఇస్తారని తొలుత ప్రకటించినా జీవోల్లో ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తరహా వ్యాధులకు కొన్ని రోజులు ఆసుపత్రుల్లో చేరి వచ్చేస్తే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోలేం. దీని వల్ల ఉద్యోగులు తర్వాత రోజుల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

* భార్యాభర్తల్లో ఇద్దరూ ఉద్యోగస్థులయితే ఇద్దరూ ప్రీమియం చెల్లిస్తే చెరో రూ. 2 లక్షల మేర వైద్యం లభించే వీలుందో లేదో స్పష్టత లేదు.

* ఉద్యోగిని విషయంలో కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు పథకం పరిధిలోకి వస్తారా? అత్తమామలు వస్తారా? అనేది సందిగ్ధం వీడలేదు.

* బయాప్సీ, కీమోథెరపీకి ఇప్పటి వరకు తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ, చెన్నైలోని అపోలో, యశోదా ఆసుపత్రులు సైతం రాష్ట్ర ప్రభుత్వ రిఫరల్‌ జాబితాలో ఉన్నాయి. తాజా పథకంలో వాటి మీద స్పష్టత ఇవ్వలేదు.

* ఎయిడెడ్‌ పాఠశాలలు, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల ఉద్యోగులను ఈ పథకం పరిధిలోకి తీసుకురాలేదు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల్లోనూ తేడా చూపించడాన్ని వారంతా నిరసిస్తున్నారు.

* తెలుపురంగు రేషన్‌కార్డు కలిగి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉద్యోగులుగా ఉంటే ఉద్యోగశ్రీ అమలు ఏవిధంగా ఉంటుందో స్పష్టత ఇవ్వలేదు.

* డివిజన్‌ కేంద్రాల్లో తాత్కాలిక ఉద్యోగశ్రీ కార్డులు ఎక్కడ జారీ చేస్తారు అన్న సమాచారంపై కలెక్టర్‌ స్థాయిలో ఇంతవరకు ప్రకటన వెలువడలేదు.

ఉద్యోశ్రీని వ్యతిరేకిస్తున్నసందర్భాలు :
ఉద్యోగశ్రీ కింద 1885 వ్యాధులకు చికిత్స చేసేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం వీటిల్లో ఎక్కువ వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు తప్పనిసరి చేయడం సరికాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అంతంతమాత్రంగా ఉంటున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఎక్కడ కార్డియాలజిస్ట్‌.. కిడ్నీ, ఛాతీ వైద్యులు ఉండరు. గతంలో ఉన్న రీఎంబర్స్‌మెంట్‌ పథకం కొంత మేలనిపిస్తోంది.

ఉద్యోగశ్రీ పథకంలో లోపాలు ఉన్నాయి. ఎక్కువ వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలనే నిబంధన సరికాదు.  ఉద్యోశ్రీ కింద ఉద్యోగులు, పింఛనుదారులందరికీ ఒక ఆరోగ్య కార్డు పొందడం శుభపరిణామం.

సేవలు అనుభవిస్తున్నవారు :
జిల్లాలోని పింఛనుదారులంతా ఇప్పటికే ఉద్యోగశ్రీ ఆరోగ్య కార్డులు పొందారు. పలువురు పథకం కింద వైద్యం చేయించుకుని ప్రయోజనం పొందుతున్నారు. మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌తో ఉన్న బాధలన్నీ కొత్త పథకంతో తీరాయన్న సంతృప్తి ఉంది. సమస్యలు ఉంటాయి. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం.

సమీక్షించాకే అమలుచేయాలి
ఉద్యోగశ్రీ పథకంలో ఎన్నో లోపాలు, అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని ఉద్యోగ సంఘాల సమక్షంలో సమీక్షించిన తర్వాత అమలు చేయాలి. ఎలాంటి తారతమ్యం లేకుండా ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల ఉద్యోగులను కూడా పథకం పరిధిలోకి తేవాలి.

జిల్లాలో 11 ఆసుపత్రుల్లో అమలు
జిల్లాలోని 11 ఆసుపత్రుల్లో ఉద్యోగశ్రీ పథకం కింద వైద్యసేవలు అందించేందుకు నిర్ణయించాం. వీటిల్లో ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో (శ్రీకాకుళం రిమ్స్‌, నరసన్నపేట, పలాస, టెక్కలి, పాలకొండ, పాతపట్నం, రాజాం) వైద్యసేవలు అందిస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో (శ్రీకాకుళంలోని కిమ్స్‌ సాయి శేషాద్రి ఆసుపత్రి, బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి, సింధూర ఆసుపత్రి, రాజాంలోని జీఎంఆర్‌ ఆసుపత్రి) వైద్యసేవలు పొందవచ్చు. ప్రభుత్వం 1885 రోగాలకు చికిత్స చేసేందుకు అనుమతించింది. వీటిల్లో 347 రోగాలకు చికిత్స తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాల్సి ఉంది. ఉద్యోగులు, పింఛనుదారులు పథకం సద్వినియోగం చేసుకుని ఆరోగ్యమంతులు కావాలి.


  • ===================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !