జిల్లాలో అన్ని ప్రభుత్వ డిగ్రీ, ఇంజినీరింగు కళాశాలల్లో వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పట్టణంలో ప్రయివేటు వ్యాయామశాలలు అయిదువరకు ఉన్నాయి. నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, రణస్థలం పట్టణాల్లో వ్యాయామశాలలున్నాయి. పురపాలకసంఘాల్లో ప్రవేశరుసుం రూ. 500, నెలసరి రుసుం రూ. 200 - రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు. మిగిలినచోట ప్రవేశరుసుం రూ. 300 తీసుకుంటుండగా, నెలసరి రుసుం రూ. 100- రూ. 200 వరకు ఉంటోంది.
ఫలహారానికి ముందే ఉత్తమం
ఎలాంటి వ్యాయామమైనా ఉదయం వేళలోనే అదీ అల్పాహారానికి ముందే చేయడం ఉత్తమం. ఆహారం తీసుకున్నాక చేయాలంటే కనీసం రెండు గంటల విరామం ఇవ్వాలి. అయినా కొన్ని ఇబ్బందులెదురౌతాయి. వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే జిమ్‌కు చేరుకోవాలని శిక్షకులు సూచిస్తున్నారు.
లావుగా ఉన్నవారు తగ్గాలనుకుంటే
కేలరీస్ తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ (గోధుమలు, ముడిబియ్యం, చిలకడ దుంపలు), ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంతవరకు పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం 5 లీటర్ల నీరు తాగాలి.
సన్నగా ఉన్న వారు పెరగాలనుకుంటే
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. 2500 కేలరీలకు తక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రొటీన్, సెట్రజస్‌ప్యాట్స్ తీసుకోవాలి. రోజుకు తప్పని సరిగా 5 లీటర్ల నీరు తాగాలి.
పోటీల్లో పాల్గొనాలంటే..
వివిధ పోటీలకు హాజరవాలనుకునేవాళ్లు మాత్రం నూనె పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫాస్ట్‌ఫుడ్స్‌ను పూర్తిగా తగ్గించుకోవాలి. పచ్చఅరటి కంటే పసుపు అరటిపళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. గుడ్డులో పసుపు భాగం వదిలి తెలుపును తీసుకోవాలి. తగినంత మోతాదులో ప్రతి రోజు పాలు తీసుకోవాలి. వేరుశెనగ పిక్కలను సుమారు 8 గంటలపాటు నీటిలో నానబెట్టి ఆరబెట్టి సాధనకు వెళ్లేముందు తీసుకోవాలి. సాధనకు 45 నిమిషాల ముందుకార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటికి తోడుగా న్యూట్రీషన్ ఆహారాన్ని తీసుకోవాలి. దీని ఖరీదు రూ. 500 నుంచి రూ. 6 వేల వరకు ఖరీదు ఉంటుంది. రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు సాధన చేస్తే శరీరం రాటుదేలుతుంది.
ఇరవైఏళ్ల దూకుడు వద్దు
20 ఏళ్లకన్నా తక్కువ వయసులోనే వెయిట్‌లిఫ్టింగ్ వ్యాయామం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం ఎదుగుదలకు తోడ్పడే కీళ్ల మధ్య గ్రోత్‌ప్లేట్లు దెబ్బతినే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. 20 ఏళ్లవరకు వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ వంటి ఆటలతోపాటు పరుగు మాత్రమే చేయాలి. వ్యాయామశాలలో కొన్ని ప్రత్యేక విభాగాల్లో నిపుణుల సూచనలతో పరిమితమైన వ్యాయామం చేయాలి.
చిట్కాలు పాటించాల్సిందే
* వ్యాయామం చేసేముందు, పూర్తయ్యాక ఎక్కువ నీళ్లు తాగాలి
* కొబ్బరినీళ్లు మరీ మంచిది.
* రక్తపోటుతో బాధపడేవారు వేసవిలో కొద్దిగా ఉప్పుఉండే వస్తువులు తీసుకున్నా ప్రమాదం ఉండదు
* నీటిశాతం ఎక్కువగా ఉన్న తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవాలి
* సాంబారు, రసం లాంటివి పెంచి మాంసాహారం, మసాలాలు తగ్గించాలి.జిల్లాలో వ్యాయామ కేంద్రాలు
పల్లెల్లోనూ చేయొచ్చు
వ్యాయామశాల సౌకర్యం లేనిచోట కూడా యువత సాధనకు అవకాశాలున్నాయి. వేకువజామునే కొంతసేపు పరిగెత్తాక వ్యక్తిగత వ్యాయామం పూర్తిచేయాలి. ఉదయం 8 గంటలలోపు చెరువులో ఈతకొట్టవచ్చు. సాయంత్రం వేళల్లో సంగిడీలు, ఈడుపురాయిలను ఎత్తడం ద్వారా దృఢత్వాన్ని పెంచుకోవచ్చు. గ్రామాల్లో డంబుల్స్, రాతితో చేసిన వెయిట్‌లిఫ్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పరిమితసంఖ్యలో చేయవచ్చు.
వ్యాయామశాల ఏర్పాటు చేయాలంటే
గిరాకీ ఉన్న దృష్ట్యా ఆసక్తిఉన్నవారు వీటిని ఏర్పాటు చేయవచ్చు. గాలి వెలుతురుతో కూడిన విశాలమైన గది ఉండాలి. కనీసం 20X30 అడుగుల కొలతలకు తక్కువ కాకుండా హాలు ఉండాలి. సాధారణ జిమ్‌ను ఏర్పాటు చేయాలంటే కనీసం రూ. 1.50 లక్షలు ఖర్చవుతుంది. అధునాతన జిమ్‌లు ఏర్పాటుకు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్స్ ఆధారిత మిషన్లతో పనిచేసే జిమ్‌లు ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జిల్లాకేంద్రంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల విలువచేసే జిమ్‌లున్నాయి.
వ్యాయామం పట్ల ఆసక్తి
జిల్లాలోని కళాశాలల్లో 20 వరకు జిమ్‌లున్నాయి. ఒక్కో కేంద్రానికి రోజూ 200కు తగ్గకుండా వెళ్తున్నారు. ఏడాది పొడవునా వచ్చేవారి సంఖ్య 50 శాతం ఉండగా, సీజనల్‌గా 3 నుంచి 4 నెలలు వచ్చే వారి సంఖ్య మరో 50శాతం ఉంటుంది. వేసవి సెలవుల్లోను, నవంబరు, డిసెంబరు నెలల్లోను జిమ్‌కు ఎక్కువగా వస్తారని నిర్వాహకులుచెబుతున్నారు.
------------
జాగ్రత్తలు అవసరం
సూర్యోదయానికి ముందే వ్యాయామం చేయడం ఉత్తమం. గంటకన్నా ఎక్కువ సమయం మంచిదికాదు. ప్రతి 15 నిమిషాలకు ఐదు నిమిషాల చొప్పున విరామం ఇవ్వాలి. గ్లూకోజ్, కొబ్బరినీరు తగినన్ని తీసుకోవాలి. మసాలాలకు దూరంగా ఉండాలి. రెండు నెలల్లో సరైన వ్యామామం చేయడం ద్వారా శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
వేగంగా ఫలితాలు ఆశించొద్దు
ఆరుపలకల మోజులో తొందరగా ఫలితం కనిపించాలని డ్రగ్స్, మందులు ప్రోత్సహిస్తున్నారు. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కనీసం ఆరు నెలలు శ్రమిస్తే మంచి శరీరాకృతి వస్తుంది.
శిక్షకుల సూచనల మేరకే..
ఏ వయస్సులోనైనా వ్యాయమం శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. ప్రస్తుతం వ్యాయామం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యింది. శిక్షకులు సూచనల ప్రకారం సాధన చేస్తే అనుకున్నదాని కంటే ముందే మంచి ఫలితాలు సాధించవచ్చు
శరీరాన్ని ఒక పద్ధతిలోకి తెచ్చుకోవాలనుకొనే వారికి ప్రత్యేకంగా దగ్గరుండి శిక్షణ ఇస్తున్నాru. లావుగా, సన్నంగా ఉండే వారు ఆరు నెలల్లో ఒక ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. బాడీ బిల్డింగ్ చేయడం వల్ల అందంతో పాటు ఆరోగ్యవంతంగా ఉండవచ్చు
శరీరాకృతులు ప్రధానంగా మూడు రకాలు. ఎండోమార్ఫ్, ఎక్టోమార్ఫ్, మెసో మార్ఫ్.
ఎండోమార్ఫ్: ముఖం గుండ్రంగా, భుజాలు వెడల్పుగా, తొడలు, నడుము లావుగా, పిరుదులు పెద్దవిగా, మోచేతులు సన్నవిగా ఉంటాయి. ఈ తరహా శరీరంలో కొవ్వుశాతం చాలా ఎక్కువగా, మెటపాలిజం తక్కువగా ఉంటుంది. ఎక్కువ వ్యాయామం చేయాలి. తక్కువ క్యాలరీలుండే పౌష్టికాహారం తీసుకోవాలి.
ఎక్టోమార్ఫ్: ముఖం కోలగాను, భుజాలు, నడుము, ఛాతి చిన్నదిగాను, చేతులు, కాళ్లు, పిరుదులు సన్నవిగాను ఉంటాయి. ఈ తరహా శరీరంలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ క్యాలరీలున్న పోషకపదార్థాలతోపాటు ఎక్కువ బరువులతో కూడిన తక్కువ వ్యాయామాలు అవసరం.
మెసోమార్ఫ్: మధ్యస్తంగా ఉండే శరీరాకృతిలో కోలముఖం, విశాలమైన ఛాతీ, బలమైన తొడలు, గుండ్రంగా ఉండే పిరుదులు, వెడల్పాంటి భుజాలు, చిన్నదిగా ఉండే నడుముతో దృఢంగా ఉంటారు. శరీరంలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. వీరికి మధ్యస్తంగా ఉండే వ్యాయామం, పోషకాహారం అవసరం.
- ====================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !